Gautam Adani | న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను కొనుగోలు చేసిన గౌతమ్ అదానీ గ్రూప్ తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్లో మెజారిటీ వాటా చేజిక్కించుకుంది. ఈ మేరకు గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఐఏఎన్ఎస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 50.50 శాతం మెజారిటీ వాటాను తమ సబ్సిడరీ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ (ఏఎంఎన్ఎల్) కొనుగోలు చేసినట్టు అదానీ ఎంటర్ప్రైజెస్ శనివారం తెలిపింది. డీల్ విలువను కంపెనీ వెల్లడించలేదు.
న్యూఢిల్లీలో రిజిష్టర్డ్ కార్యాలయం కలిగిన ఐఏఎన్ఎస్ ప్రధాన షేర్‌హోల్డరు సందీప్ బామ్జాయ్తో షేర్‌హోల్డర్ల ఒప్పందంపై ఏఎంఎన్ఎల్ సంతకాలు చేసింది. గత ఏడాది మార్చిలో ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ బీక్యూ ప్రైమ్‌ను నిర్వహించే క్వింటిల్లియన్ బిజినెస్ మీడియాను టేకోవర్ చేయడం ద్వారా మీడియా వ్యాపారంలోకి ప్రవేశించిన అదానీ గ్రూప్ అదే ఏడాది డిసెంబర్లో న్యూస్ టెలివిజన్ చానల్ ఎన్డీటీవీలో 65 శాతం వాటాను కొన్నది. తాజాగా టేకోవర్ చేసిన ఐఏఎన్ఎస్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.11.86 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.