న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ అంచనాలకుమించి రాణించింది. మార్చి 31, 2023తో ముగిసిన ఏడాదికాలంలో కంపెనీ నికర లాభం 62.3 శాతం ఎగబాకి రూ.4,709.25 కోట్లకు చేరుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.60 వేల కోట్లను అధిగమించింది. దేశంలో రెండో అతిపెద్ద ప్యాసింజర్ కార్ల విక్రయ సంస్థయైన హ్యుందాయ్ 2021-22కిగాను రూ.2,901.59 కోట్ల లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది రూ.47,378.43 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరానికిగాను రూ.60,307.58 కోట్లకు చేరుకున్నది. గతేడాది మొత్తానికి 7.27 లక్షల యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. వీటిలో దేశీయంగా 5.67 లక్షల యూనిట్లను విక్రయించగా, 1.53 లక్షల యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రస్తుతం సంస్థ క్రెటా, వెన్యూ, అల్కాజర్, టస్కన్, సెడాన్ వెర్నా, ఔరా మాడళ్లతోపాటు హ్యాచ్‌బ్యాక్‌లు గ్రాండ్ ఐ10లను విక్రయిస్తున్నది.