Hyundai IPO | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లేందుకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా 300 కోట్ల డాలర్ల ( సుమారు రూ.25 వేల కోట్లు) నిధుల సేకరణ కోసం స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’కి ముసాయిదా పత్రాలు సమర్పించింది. హ్యుండాయ్ ఐపీఓకు ‘సెబీ’ ఆమోద ముద్ర వేస్తే.. ఐపీఓ ద్వారా రూ.21 వేల కోట్ల పై చిలుకు నిధులు సమీకరించిన ఎల్ఐసీ ఐపీఓను అధిగమిస్తుందని భావిస్తున్నారు. హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) పద్దతిలో జరుగనున్నది. ఐపీఓలో భాగంగా హ్యుండాయ్ మోటార్ ఇండియాలో హ్యుండాయ్ తన 14,21,94,700 (14.21 కోట్లు) ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది. తాజాగా షేర్లు జారీ చేయరు.
1996లో భారత్ మార్కెట్లోకి ఎంటరైన హ్యుండాయ్.. ప్రస్తుతం దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థగా నిలిచింది. ప్రస్తుతం దేశంలో 13 మోడల్ కార్లను విక్రయిస్తోంది. 2023 మేతో పోలిస్తే ఈ ఏడాది మేలో కార్ల విక్రయాల్లో ఏడు శాతం వృద్ధితో 63,551 కార్లు విక్రయించింది. భారత్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దాదాపు 20 ఏండ్లకు దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అవుతుందన్న తొలి ఆటోమొబైల్ సంస్థగా హ్యుండాయ్ మోటార్ ఇండియా నిలుస్తుంది. ఇంతకుముందు 2003లో జపాన్ కార్ల తయారీ సంస్థ మారుతి అనుబంధ ‘మారుతి సుజుకి’.. దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది.