న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15:చార్జింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈవీ కార్ల కస్టమర్లకోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 11 అల్ట్రా-ఫాస్ట్ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. వీటిలో హైదరాబాద్‌తోపాటు ముంబై, పుణె, అహ్మదాబాద్, గురుగ్రామ్, బెంగళూరులలో అల్ట్రా-ఫాస్ట్ డీసీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితోపాటు జాతీయ రహదారులైన ఢిల్లీ-ఛండీగఢ్, ఢిల్లీ-జైపూర్, హైదరాబాద్-విజయవాడ, ముంబై-సూరత్, ముంబై-నాసిక్ రోడ్లపై ఐదు అల్ట్రా-ఫాస్ట్ డీసీ చార్జింగ్ స్టేషన్లను కూడా నెలకొల్పింది.
వీటిలో అన్ని చార్జింగ్ స్టేషన్లు రోజంతా తెరిచివుండనున్నాయని తెలిపింది. ఒక్కో స్టేషన్లలో డీసీ 150 కిలోవాట్లు, డీసీ 60 కిలోవాట్లు, డీసీ 30 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు చార్జింగ్ పాయింట్లను నెలకొల్పింది. హ్యుందాయ్ కస్టమర్లతోపాటు ఇతర కస్టమర్లు కూడా చార్జింగ్ చేసుకోవచ్చును. చార్జింగ్ స్టేషన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగ్‌డ్రైవ్ చేసేవారికి ఈ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఎంతగానే ఉపయోగపడనున్నాయని పేర్కొంది. కేవలం 21 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతం చార్జింగ్ కానుండటంతో సమయం ఆదాకానున్నది. 30 కిలోవాట్ల చార్జర్ ఒక్కో యూనిట్‌పై రూ.18, 60 కిలోవాట్ల చార్జర్ యూనిట్‌పై రూ.21, 150 కిలోవాట్ల చార్జర్ యూనిట్‌కు రూ.24 చార్జిని విధించింది. చార్జింగ్ స్లాట్‌ను ముందస్తు బుకింగ్‌తోపాటు చెల్లింపులు జరుపుకునే అవకాశం కూడా సంస్థ కల్పించింది. ఈ చార్జింగ్ స్టేషన్లకు సమీపంలోనే రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఇతర వసతులు సైతం నెలకొల్పింది. ఈ ఏడాదిలో మరో 10 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్న సంస్థ..2027 నాటికి ఈ సంఖ్యను 100కి పెంచుకోవాలని చూస్తున్నది.