న్యూఢిల్లీ, మే 14: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ హవా కొనసాగుతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 మాడళ్లలో మారుతికి చెందిన ఏడు కార్లకు చోటు లభించింది. కానీ, మొదటి స్థానంలో హ్యుందాయ్‌కు చెందిన క్రెటా ఈసారి తొలి స్థానాన్ని దక్కించుకున్నట్టు దేశీయ వాహన తయారీదారుల సంఘం(సియామ్) తాజాగా వెల్లడించింది.
టాప్-10 కార్లు, ఎస్‌యూవీలలో 17 వేల యూనిట్లతో క్రెటా తొలి స్థానంలో నిలిచింది. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 15,447 యూనిట్లతో పోలిస్తే 10 శాతం పెరిగాయని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో మారుతికి చెందిన డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగాలకు చోటు లభించగా..మహీంద్రాకు చెందిన స్కార్పియో ఆ తర్వాతి స్థానం లభించింది. టాప్-10 జాబితాలో టాటా మోటర్స్‌కు చెందిన వాహనాలకు చోటు లభించలేదు. గత నెలలో మొత్తంగా 1.60 లక్షల యూనిట్ల ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి.