Hyderabad | హైదరాబాద్/న్యూఢిల్లీ, జూన్ 14: హౌజింగ్ మార్కెట్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. హైదరాబాద్‌సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలపై రియల్టర్ల అత్యున్నత సంఘం క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్, డాటా అనలిటిక్ సంస్థ లియాసెస్ ఫోరాస్ కలిసి తాజాగా ఓ నివేదికను విడుదల చేశాయి. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ‘హౌజింగ్ ప్రైస్-ట్రాకర్ రిపోర్టు క్యూ1 2023’ పేరిట బుధవారం ఈ రిపోర్టు విడుదలైంది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె, అహ్మదాబాద్‌ల్లో గత ఏడాది జనవరి-మార్చితో పోల్చితే ఈసారి ఇండ్ల ధరలు 8 శాతం పెరిగినట్టు తేలింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఆర్)లో అత్యధికంగా చదరపు అడుగు రూ.19,219 పలుకుతున్నది. ఆ తర్వాత హైదరాబాద్‌లోనే చదరపు అడుగు రూ.10,410గా ఉన్నది. ఇక నిరుడుతో పోల్చితే ఈ జనవరి-మార్చిలో ముంబై-ఎంఆర్‌లో ఇండ్ల ధరలు 2 శాతం క్షీణించాయి. హైదరాబాద్‌లో మాత్రం 13 శాతం పెరిగాయి. కాగా, ఇండ్ల రేట్ల పెరుగుదలలో ఢిల్లీ-ఎన్సీఆర్ 16 శాతంతో ముందున్నది. ఆ తర్వాత కోల్‌కతా (15 శాతం), బెంగళూరు (14 శాతం) ఉన్నాయి.
‘పెరిగిన డిమాండ్‌తోపాటు ఎగిసిన నిర్మాణ వ్యయం.. ఇండ్ల ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నివాస గృహాల ధరలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. గృహ రుణాల వడ్డీరేట్లు స్థిరంగా ఉండటం, భవిష్యత్తులో తగ్గుతాయన్న అంచనాలు అమ్మకాలను పెంచుతున్నాయి’ -క్రెడాయ్, కొల్లీర్స్, లియాసెస్ ఫోరాస్