హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను వేగంగా ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఆదేశిస్తున్నా, రాష్ట్రంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనూ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది.
రాష్ట్రమంతటా 750 చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి సంఖ్యను 2,000 పెంచాల్సిన అవసరం ఉన్నదని అధికారులు గుర్తించారు. మిగతా జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగింది. వీటికోసం కనీసం 150 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఏడాది క్రితం రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ (టీజీ రెడ్కో)ను ఆదేశించింది. ఇంతవరకు 72 మాత్రమే నిర్వహణలోకి వచ్చాయి. మరో 59 ఏర్పాటుకు పనులు సాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మిగతా 19 ఏర్పాటుకు అవసరమైన స్థలాలను చూపడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్టు తెలిసింది.
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల కొరతను అధిగమించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల అవరణల్లో ఖాళీ స్థలాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు ముసాయిదాను అన్ని రాష్ర్టాలకు పంపింది. ఈ మేరకు ప్రతిపాదనలపై అభ్యంతరాలను, సలహాలను పంపాలని రాష్ర్టాలకు సూచించింది. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు స్థలాలు ఇవ్వడానికి నిబంధనలు, టెండర్ బిడ్డింగ్ ప్రక్రియ విధానాన్ని రూపొందించాలని సూచించింది. స్థలాలను పొందేందుకు అందరికీ అవకాశాలు కల్పించాలని, చార్జింగ్ స్టేషన్లు 24 గంటలు పనిచేసేందుకు అవసరమైన అన్నిరకాల అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. విద్యుత్తు కనెక్షన్ ఇవ్వడానికి, సమస్యల పరిష్కారానికి ఒక ప్రభుత్వ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని సూచించింది.
రాష్ట్ర ఇంధనశాఖ కార్యదర్శి చైర్మన్గా, రవాణా, పురపాలక, ఇతర అవసరమైన విభాగాల వారితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళిక, పర్యవేక్షణ బాధ్యతలు ఈ కమిటీకి అప్పగించాలని పేర్కొంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖలు కూడా రాసింది. కానీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.
టీజీ రెడ్కో నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకొని ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైనా రోడ్డు పక్కన స్థలం ఉంటే ఈవీ చార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు. అపార్టుమెంట్లలో అందరికీ ఉపయోగపడేలా చార్జింగ్ స్టేషన్ పెట్టాలన్నా ఎన్వోసీ తప్పనిసరి. అది లేకుండానే హైదరాబాద్ నగరంలోని కొన్ని అపార్టుమెంట్లలో చార్జింగ్ స్టేషన్లు పెడుతున్నట్టు అధికారులు గుర్తించారు.