రాష్ట్ర బృందం జపాన్ పర్యటనలో చేసుకుంటున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ డొల్ల కంపెనీలతోనేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి ఎక్కడా ఊరు.. పేరు.. లేదని వెల్లడైన మరునాడే మరో కంపెనీ బాగోతం బట్టబయలైంది. రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న మారుబేనీ సైతం అత్యంత వివాదాస్పద కంపెనీ అని తేలింది.
Marubeni | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బృందం జపాన్ పర్యటనలో చేసుకుంటున్న పెట్టుబడి ఒప్పందాలన్నీ డొల్ల కంపెనీలతోనేనా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,700 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న ఉర్సా కంపెనీకి ఎక్కడా ఊరు.. పేరు.. లేదని వెల్లడైన మరునాడే మరో కంపెనీ బాగోతం బట్టబయలైంది. రూ.1,000 కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకున్న మారుబేనీ కంపెనీ సైతం అత్యంత వివాదాస్పద కంపెనీ అని తేలింది. నైజీరియా, ఇండోనేషియాల్లో లంచాల కేసులు నమోదవగా, జరిమానాలు చెల్లించి బయటపడింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు 2 రోజుల క్రితమే మారుబేని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం విదితమే. అంతేకాదు అందులో దాదాపు రూ.5,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 30 వేల ఉద్యోగాలు లభిస్తాయని కూడా ప్రకటించారు. కాగా, సదరు కంపెనీపై పలు దేశాల్లో అనేక అవినీతి ఆరోపణలున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మారుబేనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది మారుబేనీ కార్పొరేషన్ (జపాన్) అనుబంధ సంస్థ. సదరు కంపెనీకి లంచాల కేసులో అమెరికా న్యాయ శాఖ గతంలో 88 మిలియన్ డాలర్ల జరిమానా విధించినట్టు తెలిసింది. నైజీరియాలోని బోనీ ఐలాండ్లో గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన కాంట్రాక్టును దక్కించుకునేందుకు టీఎస్కేజీ కంపెనీ ద్వారా అక్కడి అధికారులకు లంచం ఇచ్చినట్టు నైజీరియా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 54.6 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించి కేసు పరిష్కరించుకున్నది. కంపెనీపై యుఎస్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్సీపీఏ) కింద కేసు కూడా నమోదైంది. అంతేగాక ఇండోనేషియాలో విద్యుత్తు సేవలు (పవర్ సర్వీసెస్) సమకూర్చేందుకు ఉద్దేశించిన 118 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకునేందుకు అక్కడి పార్లమెంటు సభ్యులతోపాటు అధికారులకు లంచం ఇచ్చిన వ్యవహారంలో మారుబేనీపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో 8 క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలడంతో యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ 88 మిగియన్ల జరిమానా విధించింది. అలాగే మారుబేనీ భారత్లో ఇంతవరకు ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.
మారుబేనీ కంపెనీ 2022-23లో ప్రకటించిన ప్రకారం నిర్వహణ ఆదాయం రూ. 100-500 కోట్లే. అలాగే కంపెనీ ట్రాక్ రికార్డు చూసుకుంటే.. 1996 నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ ఇంతవరకు చెప్పుకోదగ్గ ఒక్క కంపెనీని కూడా భారత్లో సదరు సంస్థ ఏర్పాటు చేయలేదు. అనేక కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికీ వాటిల్లో చాలా కంపెనీలు ఆలస్యం కావడమో, లేక అసలు స్థాపించకపోవడమో జరిగింది. మన రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ నిధులు ఎలా సమకూర్చుకుంటుందనేది ఎక్కడా వెల్లడించలేదు. ఇది ఎక్కువగా కేపీడీఎల్ భాగస్వామ్య కంపెనీ భాగస్వామ్యంతోనే పెట్టుబడులు పెడుతుండటం కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నది. మారుబేనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంతవరకు స్వతంత్రంగా వెబ్సైట్ను నిర్వహించడంగానీ, సీఎస్ఆర్ వివరాలు వెల్లడించడంగానీ జరగలేదు. కంపెనీ ఆర్థిక వివరాలు, ఉద్యోగుల సమాచారం కూడా తెలియరాదు. దీంతో కంపెనీపై అనుమానాలకు తావిస్తున్నది.
అనేక దేశాల్లో లంచాల కేసులున్న వివాదాస్పద మారుబేనీ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ఏమిటి? మారుబేనీ కంపెనీపై నైజీరియా, ఇండోనేషియా దేశాల్లో లంచాల కేసులు ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం ఒప్పందాలు చేసుకునే ముందు కంపెనీల ట్రాక్ రికార్డు పరిశీలించాలి. ఊరూ.. పేరు.. లేని ఉర్సా కంపెనీ తరహాలోనే మారుబేనీ కూడా ఉన్నది.