ఈ నగరానికి ఏమైంది. అవును.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను చూస్తే ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతున్నాయిప్పుడు. ఒకప్పుడు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన ఆఫీస్ స్పేస్.. ఇప్పుడు ఆదరణ లేక కళావిహీనంగా కనిపిస్తున్నది. అద్దెకు తీసుకునేవారే కరువైపోయారు మరి. గతంలో ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొనేందుకు క్యూ కట్టిన కార్పొరేట్లు.. ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. దీంతో లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉన్నాయంటూ రియల్ ఎస్టేట్ రిపోర్టులు వస్తున్నాయి.
Office Space | న్యూఢిల్లీ, మే 1 : హైదరాబాద్‌లో కార్యాలయ స్థలాలకు పెద్దగా ఆదరణే లేకుండాపోయింది. ఒకప్పుడు దేశంలోని ప్రధాన నగరాలను వెనక్కినెడుతూ ఆఫీస్ స్పేస్ మార్కెట్లో దూసుకుపోయిన రాష్ట్ర రాజధాని నగరానికి ఇప్పుడు డిమాండ్ కనిపించడం లేదు. ఏడాదిన్నర క్రితం వరకు హైదరాబాద్‌లో ఆఫీస్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపిన కార్పొరేట్లు.. ప్రస్తుతం ఆసక్తి చూపించడం లేదు. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ విడుదల చేసిన తాజా గణాంకాలే ఇందుకు నిదర్శనం.
దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ స్పేస్ మార్కెట్‌పై వెస్టియన్ సర్వే చేసింది. దీని వివరాల ప్రకారం హైదరాబాద్‌లోనే గరిష్ఠంగా కార్యాలయ స్థలాలు వృథాగా పడిపోయి ఉన్నట్టు తేలింది. ఏకంగా 284 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉన్నదని వెస్టియన్ ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి హైదరాబాద్‌లో మొత్తం అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్ 1,620 లక్షల చదరపు అడుగులు. ఇందులో 284 లక్షల చదరపు అడుగులు ఖాళీగానే ఉన్నది. ఇది మొత్తం స్టాక్‌లో 17.5 శాతానికి సమానం. కార్పొరేట్ కంపెనీలు అద్దెకు తీసుకొనేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదని వెస్టియన్ పేర్కొన్నది. కాగా, గతంలోనూ ఆయా నగరాల్లో ఆఫీస్ స్పేస్ ఖాళీలుండేవి. అయితే హైదరాబాద్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించేది. దాంతో ఆఫీస్ స్పేస్ గిరాకీలో నగరం ఎప్పుడూ టాప్‌లో ఉండేది. మిగతా నగరాలతో పోల్చితే లీజింగ్ పెద్ద ఎత్తున జరిగేది మరి. కానీ మారిన పరిస్థితులతో ఇప్పుడు ఖాళీల్లో టాప్‌లో ఉంటున్నది.
ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి అందుబాటులో ఉన్న ఆఫీస్ స్పేస్‌కు గిరాకీ అంతంతమాత్రంగానే ఉండటంతో కొత్త నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. రియల్టర్లు, ఆఫీస్ స్పేస్ నిర్మాణ కంపెనీలు నూతన ప్రాజెక్టులకు దూరంగా ఉంటున్నాయి. ఫలితంగా సిమెంట్, ఉక్కు, ఇతర నిర్మాణ అనుబంధ రంగాలు కుదేలయ్యాయి. వాటిమీద ఆధారపడుతున్న పరిశ్రమలు, వ్యాపారులు, ఉద్యోగులు, కూలీల భవిష్యత్తు ఆందోళనలో పడింది. నిజానికి హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న కార్యాలయ స్థలాలు మునుపు ఇంకా ఎక్కువ (19 శాతం)గానే ఉండేవి. కానీ కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ఇవి కాస్త తగ్గాయి. కాగా, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా, పుణె నగరాలపై వెస్టియన్ సర్వే చేసింది.
ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకన సాగిన అభివృద్ధి.. విభజన అనంతరం తెలంగాణలో పరుగులు పెట్టింది. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు అన్ని రంగాలను బలపర్చాయి. ఐటీ, ఫార్మా, ఆటో, ఏవియేషన్, డిఫెన్స్ ఇలా కీలక రంగాలు వృద్ధిపథంలో పయనించాయి. ఇది ఇక్కడి నిర్మాణ రంగానికి ఊహించని స్థాయిలో డిమాండ్‌ను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆఫీస్ స్పేస్‌కు గిరాకీని అమాంతం పెంచేసింది. దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు భారీగా ముందుకొచ్చాయి. భారత్‌లోకి రావాలంటే హైదరాబాద్‌నే ప్రధాన కేంద్రంగా చేసుకోవాలన్నంతగా డిమాండ్ నెలకొన్నదంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి అనేక సంస్థలు హైదరాబాద్‌లో బడాబడా ఆఫీసులను తీసుకొచ్చాయి. మరెన్నో స్టార్టప్‌లూ కొలువుదీరాయి. ఫలితంగా ఆఫీస్ మార్కెట్ వేగంగా విస్తరించింది. దాదాపు పదేండ్ల టీఆర్ఎస్, బీఆర్ఎస్ పాలనలో ఇలాగే సాగిందంతా. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అంతా తలకిందులైంది. ఏడాదిన్నరగా పెట్టుబడులు రాక మార్కెట్లో స్తబ్ధత నెలకొన్నది. అందుకు ఆఫీస్ స్పేస్ మార్కెట్ అద్దం పడుతున్నది.