హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో న్యూయార్క్‌కు చెందిన బయోటెక్ దిగ్గజం రీజెనెరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటుకు సంబంధించి మంత్రి సమక్షంలో ఒప్పందం జరిగింది. రీజెనెరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈవో సర్వేశ్ సింగ్‌లు ఈ మేరకు అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీసీసీల రాకతో మన ఐటీ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు మెరుగవుతున్నాయన్నారు. రెజెనెరాన్కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న జీసీసీ గ్లోబల్హబ్గా పనిచేయనున్నట్టు మంత్రి వివరించారు.
ఈ జీసీసీ ప్రపంచ వ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డాటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నత స్థాయి డిజిటల్ సేవలను అందిస్తున్నదని మంత్రి వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 450 జీసీసీలు పనిచేస్తుండగా.. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏఐ, డాటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీల రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తున్నదని పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీ విస్తరణ, త్వరలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మా సిటీ వంటివి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు. రెజెనెరాన్ ఏర్పాటు చేయనున్న జీసీసీతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి అన్నారు.
ఎంఎస్ఎంఈలే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు హైటెక్స్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఎంఎస్ఎంఈ గ్రీనింగ్ సమ్మిట్-ర్యాంప్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యత, ఆర్థిక వృద్ధి కలిసి ముందుకు సాగేలా ఒక పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థను రాష్ట్రంలో నిర్మించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మార్పు రైజింగ్ తెలంగాణ లక్ష్య సాధనకు కీలకమని తెలిపారు.