మన ఎయిర్ ట్రాఫిక్ భళా..
జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు సృష్టించింది.
- ప్రయాణికుల రాకపోకల్లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు రికార్డు
- ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో కోటీ 20 లక్షలపైనే
- గత ఏడాదితో పోల్చితే 24% వృద్ధి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) ప్రయాణికుల రాకపోకల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. సోమవారం ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2022-23) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)తో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ఏప్రిల్-సెప్టెంబర్‌లో 24 శాతం వృద్ధితో మునుపెన్నడూ లేనివిధంగా ఏకంగా 12 మిలియన్ల (కోటీ 20 లక్షలపైనే)కుపైగా ప్రయాణికులకు విమానయాన సేవలు అందాయి.
కాగా, ఇదే సమయంలో దేశం మొత్తం మీద విమాన ప్రయాణికుల రద్దీ 75.4 మిలియన్లుగా ఉన్నట్టు తేలింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సేవల్లో 3వ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. ఇక జీహెచ్‌ఐఏఎల్‌లో విమానాల రాకపోకలు (ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్స్ లేదా ఏటీఎం) ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో గణనీయంగా పెరిగి 42,625గా నమోదయ్యాయి. ఇందులో దేశీయ విమాన సర్వీసులు 35,782, అంతర్జాతీయ విమాన సర్వీసులు 6,843గా ఉన్నాయి.
జూలై-సెప్టెంబర్‌లో..
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దేశీయంగా ప్యాసింజర్ ట్రాఫిక్ 24 శాతం, అంతర్జాతీయంగా 23 శాతం పెరిగింది. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో ప్యాసింజర్లు 4.9 మిలియన్లుగా ఉంటే, ఈసారి 6 మిలియన్లకుపైగానే ఉన్నారు. ఒక్క ఈ అక్టోబర్ నెలలోనే దేశీయ ప్రయాణికులు 20 లక్షలుగా ఉన్నారని జీహెచ్ఐఏఎల్ తెలియజేసింది. నిరుడు ఇదే నెల 14.8 లక్షలే. అలాగే అక్టోబర్‌లో శంషాబాద్‌లోని ఈ ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ ప్రయాణికులు 3 లక్షలుగా నమోదయ్యారు. గత ఏడాది 2 లక్షలే. అక్టోబర్‌లో విమాన సర్వీసులు దేశీయంగా 12,548, అంతర్జాతీయంగా 2,198 ఉన్నాయి. నిరుడుతో పోల్చితే 12 శాతం వృద్ధి ఉన్నది.
- 80కిపైగా దేశ, విదేశీ గమ్యస్థానాలకు విస్తృతమైన రూట్ నెట్వర్క్, కనెక్టివిటీతో దక్షిణ మధ్య భారత్‌లో గేట్‌వే ఆఫ్ ఛాయిస్‌గా పేరొందింది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. వార్షిక ప్రయాణికుల రద్దీపరంగా 4వ స్థానానికి ఎగిసింది.
- ఇక కరోనాకు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి 55 దేశీయ గమ్యస్థానాలకే విమాన సర్వీసులుండేవి. అయితే ఇప్పుడు 66కు పెరిగాయి. అలాగే 16 నుంచి 19కి అంతర్జాతీయ గమ్యస్థానాలు చేరాయి.
- దేశంలోని మెట్రో నగరాలను మినహాయిస్తే.. గోవా, విశాఖపట్నం, కొచ్చి, తిరుపతి, అహ్మదాబాద్ లాంటి నగరాలకూ జోరుగా విమానాలు నడుస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి 14 ఇంటర్నేషనల్ రూట్లలో ఇండిగో సర్వీసులున్నాయి.
- వచ్చే ఏడాది జనవరి నుంచి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్.. హైదరాబాద్, ఫ్రాంక్ఫర్ట్ మధ్య విమాన సర్వీసుల్ని నడుపనున్నది. ఇక్కడి నుంచి దేశంలోని టైర్-2, 3 నగరాలకూ సేవలందుతుండటం గమనార్హం.
- భవిష్యత్తులో ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య, ఐరోపా దేశాలకూ గేట్‌వేలాగా మారనున్న హైదరాబాద్ ఎయిర్‌పోర్టు
- ప్రస్తుతం చికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, డల్లాస్, మెల్బోర్న్, సిడ్నీ, పారిస్, అమ్స్టర్డమ్, ఇండోనేషియా, వియత్నాం, కజకిస్థాన్, నేపాల్‌లోని గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడంపై జీహెచ్ఐఏఎల్ దృష్టి సారించింది.
- దేశ, విదేశీ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దశల వారీగా ఎయిర్‌పోర్టు విస్తరణ. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన 56,474 చదరపు మీటర్ల ఏరియా. దీంతో 2,74,118 చదరపు మీటర్లకు చేరిన మొత్తం వైశాల్యం.
- వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ దాదాపు 155 మిలియన్లకు, అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ 70 మిలియన్లకు చేరవచ్చని ఏవియేషన్ అడ్వైజరీ సంస్థ క్యాపా అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

