Hurun Global Rich List 2025 | హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2025 టాప్-10 సంపన్నుల జాబితాలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అబానీ స్థానం కోల్పోయారు. గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిన అప్పుల కారణంగా అంబానీ సంపద రూ.లక్ష కోట్లు తగ్గింది. దాంతో ఆయన టాప్-10 నిష్క్రమించగా.. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా తన స్థానాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఈ జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆయన మొత్తం సంపద ఊహించని విధంగా 82శాతం పెరిగి.. 420 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇక 266 బిలియన్ డాలర్ల సంపదతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ రెండోస్థానంలో ఉన్నారు. 242 బిలియన్ డాలర్లతో మెటా సీఈవో జుకర్‌బర్గ్ మూడో స్థానంలో ఉన్నారు. మరో వైపు రూ.3.5లక్షల కోట్ల సంపదతో హెచ్‌సీఎల్‌కు చెందిన రోష్ని నాడార్.. టాప్-10 సంపన్న మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆమె తండ్రి శివ్ నాడార్ ఇటీవల హెచ్ఎస్ఎల్ 47శాతం వాటాను ఆమె పేరిట బదిలీ చేయడంతో ఐదో స్థానానికి చేరుకున్నారు.
టాప్-10 జాబితాలో చోటు కోల్పోయిన ముఖేశ్ అంబానీ.. ఆసియాలో సంపన్నుడిగా కొనసాగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన, రిటైల్ వ్యాపారాలతో ఇబ్బందిపడుతున్నది. నష్టాల నేపథ్యంలో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ సంపద తగ్గింది. అలాగే, హురున్ జాబితాలో భారత్‌లో అంబానీ కుటుంబం తొలి స్థానంలో నిలిచింది. సంపద 13 శాతం తగ్గినా.. రూ.8.6 లక్షల కోట్లుగా ఉన్నది. ఆ తర్వాత గౌతమ్ అదానీ కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. గత సంవత్సరంలో అదానీ నిరకర విలువ దాదాపుగా రూ.లక్ష కోట్లు పెరిగింది. ప్రస్తుతం అదానీ కుటుంబం ఆస్తులు రూ.8.4లక్షల కోట్లు. రోష్ని నాడార్ కుటుంబం (రూ.3.5లక్షల కోట్లు), సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కు చెంది దిలీప్ సంఘ్వీ కుటుంబం రూ.2.5 లక్షల కోట్లుగా ఉన్నది. ఆయన సంపద 21శాతం పెరగడంతో ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచారు.
అజీమ్ ప్రేమ్‌జీ కుటుంబం (రూ.2.2 లక్షల కోట్లు), కుమార మంగళం బిర్లా కుటుంబం (రూ.2.0లక్షల కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సైరస్ పూనావాలా కుటుంబం (రూ.2లక్షల కోట్లు), నీరజ్ బజాజ్ ఫ్యామిలీ (రూ.1.6 లక్షల కోట్లు), రవి జైపురియా కుటుంబం (రూ.1.4 లక్షల కోట్లు) , రాధా కిషన్ దమానీ కుటుంబం (రూ.1.4లక్షల కోట్లు)తో టాప్-10లో చోటు దక్కించుకున్నారు. గత సంవత్సరంలో పోలిస్తే బిలియనీర్ల సంఖ్య పెరిగి 284కు చేరింది. గతంలో బిలియనీర్ల జాబితాలో ఉన్న 27 మంది సంపద కోల్పోయినా.. మొత్తం సంపన్నుల సంఖ్య పెరగడం విశేషం. వీరి వద్ద మొత్తం ఉన్న సంపద రూ.98లక్షల కోట్లు. 90 మంది బిలియనీర్లతో ముంబయి అగ్రస్థానంలో కొనసాతున్నది. ‘బిలియనీర్స్ క్యాపిటల్ ఆఫ్ ఆసియా’ టైటిల్‌ని ముంబయి కోల్పోగా.. చైనాలో షాంఘై నగరం దక్కించుకున్నది.