Agriculture | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) భారీగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. వ్యవసాయంతోపాటు నాలుగు అనుబంధ రంగాల్లో 100% ఎఫ్‌డీఐకి అనుమతిస్తూ మోదీ ప్రభుత్వం 2015 ఆగస్టులో నిర్ణయం తీసుకోవడంతో ఈ రంగాల్లో విదేశీ పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రూ.796 కోట్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2020-21 నాటికి దాదాపు 150% పెరిగి రూ.1,983.87 కోట్లకు చేరినట్టు స్వయంగా కేంద్ర వ్యవసాయ శాఖే తన నివేదికలో వెల్లడించింది. ఇలా 2014-21 మధ్య కాలంలో మొత్తంగా రూ.6,597.51 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వ్యవసాయరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌డీఐ పెరగడమంటే ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమేనని స్పష్టం చేస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుండటంతో దేశ అవసరాలకు సరిపడా వంట నూనెలు, పప్పులను ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. పలు రకాల ఆహార ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాపురించింది. గత మూడేండ్ల నుంచి ఈ దిగుమతులు అధికమయ్యాయి. 2019-20తో పోల్చితే 2020-21లో 4.79% పెరిగాయి. 2018-19లో రూ.1.37 లక్షల కోట్లుగా ఉన్న ఈ దిగుమతులు.. 2019-20లో రూ.1.47 లక్షల కోట్లకు, 2020-21లో రూ.1.54 లక్షల కోట్లకు చేరాయి. ఈ దిగుమతుల్లో వంట నూనెలు 19.79%, పండ్లు 11.51%, పప్పులు 16.79%, నూనె గింజలు 41.73% ఉన్నాయి.
ఎఫ్‌డీఐలు పెరుగుతున్నాయంటే ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్నాయన్నంటే. దీంతో రైతులు, కూలీలు తీవ్రంగా నష్టపోతారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదు. వ్యవసాయ భూములు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తాయి.
– సారంపల్లి మల్లారెడ్డి, రైతు సంఘం నేత