Maruti Suzuki | న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకీ.. కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. పండుగ సీజన్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేటంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు మాడళ్లను తగ్గింపు ధరకు విక్రయించడంతోపాటు అదనంగా రాయితీలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నది. ఎంపిక చేసిన మాడళ్లపై ఈ నెల చివరి వరకు ఈ రాయితీలు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. వీటి వివరాలు..
మారుతి నుంచి చౌకైన కారైన ఆల్టో కే10తోపాటు ఎస్-ప్రెస్సో, సెలేరియా మాడళ్లపై రూ.50 వేల వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. దీంట్లో మాన్యువల్ రకంపై రూ.30 వేలు, ఏఎంటీ మాడల్‌పై రూ.35 వేలు నగదు డిస్కౌంట్ ఇస్తున్న సంస్థ..అదనంగా రూ.15 వేలు ఎక్సేంజ్ బోనస్ కూడా కల్పిస్తున్నది. అలాగే కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.2 వేలు ఇస్తున్నది.
వ్యాగన్ఆర్, ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన స్విఫ్ట్ పై కూడా మారుతి రాయితీ కల్పిస్తున్నది. వ్యాగన్ ఆర్‌పై రూ.25 వేల వరకు నగదు రాయితీ లేదా రూ.30 వేల విలువైన విడిభాగాల కిట్ ప్యాకేజి ఏదైన ఎంచుకోవచ్చును. దీంతోపాటు ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో రూ.2 వేలు లభించనున్నాయి. నూతన స్విఫ్ట్‌పై రూ.50 వేల వరకు రాయితీతోపాటు అదనంగా ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.15 వేలు పొందవచ్చును. అలాగే డిజైర్(పాతది), బ్రెజ్జాలపై రూ.15 వేల నగదు డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేల వరకు ఇస్తున్నది.
ఇగ్నిస్, బాలెనోతోపాటు ఇతర మాడళ్లను కొనుగోలు చేసేవారికి లక్ష రూపాయల వరకు రాయితీ కల్పిస్తున్నది మారుతి సుజుకీ. వీటిలో ఇగ్నిస్, బాలెనోపై రూ.45 వేల వరకు నగదు రాయితీ, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ.2,100 ఇస్తున్నది. అలాగే ఫ్రాంక్స్, సియాజ్లపై రూ.50 వేల వరకు డిస్కౌంట్‌కు విక్రయిస్తున్నది. కానీ జిమ్నీ జెటాపై అత్యధికంగా రూ.1.95 లక్షలు, జిమ్నీ ఆల్ఫాపై రూ.2.5 లక్షల తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది. అలాగే ఎక్స్ఎల్ఆర్, గ్రాండ్ విటారా, ఇన్విక్టోలపై నగదు డిస్కౌంట్ కింద రూ.40 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద మరో రూ.20 వేలు, గ్రాండ్ విటారాపై రూ.50 వేలు నగదు డిస్కౌంట్‌తోపాటు అదనంగా రూ.1.05 లక్షల ఎక్సేంజ్ బోనస్ కింద అందిస్తున్నది.