Increase your Credit Score | రుణం తీసుకోవాలంటే క్రెడిట్ స్కోరు కీలకమనే విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే, రుణం తీసుకునేవరకూ చాలామంది ఈ క్రెడిట్ స్కోర్ విషయాన్ని అస్సలు పట్టించుకోరు. కార్డు బిల్లులను సమయానికి కట్టకపోయినా, క్రెడిట్ కార్డు పరిమితిని ఎక్కువసార్లు గరిష్ఠంగా వాడుకున్నా.. మన క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడుతుంది. అయితే, చాలా చిన్న కారణాలకూ క్రెడిట్ స్కోర్ తగ్గడమంటూ ఏమీ ఉండదు. ఇంతకీ, క్రెడిట్ స్కోరుపై ప్రభావం పడే అంశాలేమిటంటే..
రుణం తీసుకుని మొత్తం కట్టేసిన తర్వాత, పూర్తిగా క్లోజ్ చేయాలి. అప్పుడు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఆ రుణాన్ని సెటిల్డ్ లేదా అకౌంట్ సోల్డ్ అనే కేటగిరిగా పరిగణిస్తాయి. ఒకవేళ రుణం కాస్త పెండింగ్ ఉన్నా, ఆ ఖాతాకు సంబంధించి నెగటివ్ ముద్రవేస్తారు. ఇలా, ఒక ఖాతా లేదా ఒకటి కంటే ఎక్కువ నెగటివ్ ఖాతాలుంటే క్రెడిట్ రిపోర్టు ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది.
బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నించినప్పుడు అవి మీ ప్రొఫైల్ గురించి క్రెడిట్ స్కోరు అందించే సంస్థల వద్ద విచారిస్తాయి. కొంతమంది అవసరం లేకపోయినా ఎక్కువ క్రెడిట్ కార్డులు, వివిధ బ్యాంకుల్లో రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఎక్కువ అప్పులు తీసుకుని మంచి లైఫ్ స్టయిల్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎక్కువ రుణాలు తీసుకుంటే అది క్రెడిట్ స్కోరుపై రుణాత్మక ప్రభావం చూపుతుంది. ఎక్కువ రుణ విచారణలు చేసినవారి విషయంలో క్రెడిట్ స్కోరు మీద పది శాతం ప్రభావం చూపుతుంది.
మీకు అక్కర్లేకపోయినా, ఆఫర్లు, తక్కువ వడ్డీ రేట్లు చూసి రుణ దరఖాస్తులు చేశారా? అయితే, ఇది మీకు ప్రమాదమే. ప్రస్తుతం ఒక క్రెడిట్ కార్డు ఉంటే చాలు.. కంపెనీలు లేదా ఆర్థిక సంస్థలు మరో క్రెడిట్ కార్డును ఇచ్చేందుకు లేదా వ్యక్తిగత రుణం అందించేందుకు మీ చుట్టూ తిరుగుతాయి. అయితే, క్రెడిట్ కార్డు లేదా రుణ దరఖాస్తు తిరస్కరణకు గురైనట్లయితే, అది క్రెడిట్ స్కోరు మీద ప్రతికూల ప్రభావం పడుతుంది.
మీ కార్డు పరిమితిలో ఎంతవరకూ వాడుతున్నారనేది తెలిపేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్). క్రెడిట్ స్కోరును ప్రభావితం చేసేవాటిలో ఇది మరో ముఖ్య కారణం. దాదాపు 30 శాతం క్రెడిట్ స్కోరు యుటిలైజేషన్ రేషియో మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, మీకు క్రెడిట్ కార్డుకు ఇచ్చిన పరిమితి లక్ష రూపాయలు ఉందనుకుందాం. అందులో ఖర్చు అరవై వేలు ఉన్నట్లయితే, క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోను అరవై శాతంగా అర్థం చేసుకోవాలి. దీంతో, మీరు అప్పును ఎలా మేనేజ్ చేస్తారు? క్రెడిట్‌కార్డు వాడకం అలవాటు వంటివి తెలుస్తాయి.
మీ క్రెడిట్ రిపోర్టు వచ్చినప్పుడు దానిలో అన్ని అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ప్రధానంగా పేమెంట్ హిస్టరీ విషయంతో ప్రారంభించి దేన్ని మిస్ చేయకుండా చదవాలి. ఎందుకంటే, పేమెంట్ హిస్టరీ అనేది 30 శాతం వరకూ క్రెడిట్ స్కోరును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆలస్యంగా చేసిన వాయిదాల చెల్లింపులు ఎలాంటి హానీ చేయవులే అని చాలామంది అనుకుంటారు. కానీ, అది తప్పు అని గుర్తుంచుకోవాలి.
ఎక్కువ మంది క్రెడిట్ స్కోరు అనే మాట గురించి తెలిసినా పట్టించుకోరు. కొత్త రుణానికి ప్రయత్నించినప్పుడు అందుకోసం బ్యాంకులు క్రెడిట్ స్కోరు మీద ఎంతలా ఆధారడపతాయో అందరికీ తెలియకపోవచ్చు. మాములుగా 750 పైన క్రెడిట్ స్కోరు ఉన్న వారి రుణ దరఖాస్తులు సులువుగా అంగీకరిస్తారు. అందుకే రుణ దరఖాస్తు తిరస్కరణకు గురి కాకూడదనుకుంటే ముందే క్రెడిట్ స్కోరును చెక్ చేసుకోవాలి.
క్రెడిట్ కార్డు, రుణం సంబంధించి చెల్లింపులు సరిగ్గా జరకపోతే మాత్రమే అది రుణచరిత్ర మీద ప్రభావం చూపుతుందనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే, విద్యుత్ లేదా టెలిఫోన్ బిల్లు వంటివి సైతం సకాలంలో చెల్లించకపోయినా అది క్రెడిట్ రిపోర్టు లేదా క్రెడిట్ హిస్టరీ మీద ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి.
“Personal Loan | తక్కువ వడ్డీపై పర్సనల్ లోన్ అర్హతలు.. ఇంకా ఏమేం కావాలంటే?!”