Justice SuryaKant : భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief justice of India) గా రేపు జస్టిస్ సూర్యకాంత్ (Justice SuryaKant) ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన చీఫ్ జస్టిస్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఇదిలావుంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా (Haryana) వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ గుర్తింపు పొందనున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు.
2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు.
ఆర్టికల్ 370 రద్దుపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాఆంత్ ఉన్నారు. దీంతోపాటు వాక్స్వాతంత్య్రం, అవినీతి, బీహార్ ఓటర్ల జాబితా, పర్యావరణం, లింగసమానత్వం లాంటి అంశాల్లోనూ ఆయన కీలక తీర్పులను వెలువరించారు.