IT Returns | గత ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు దగ్గర పడుతున్నది. ఈ నెలాఖరులోగా వేతన జీవులు, చిన్న వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సుమారు 2.22 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. ఐటీఆర్ దాఖలు చేయడానికి కీలకం ఫామ్-16.. ఆ ఫామ్-16 లేకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవచ్చా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఆర్థిక సంవత్సరం సంపాదించిన ఆదాయం, చెల్లించిన పన్ను వివరాలతో ఫామ్-16 జారీ చేస్తారు. ఆదాయం పన్ను పరిమితికి మించి ఆదాయంపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) కట్ చేసి ఆయా కంపెనీల యాజమాన్యాలు.. ఉద్యోగులకు ఫామ్-16 జారీ చేస్తాయి. ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే ఫామ్-16 జారీ చేయరు. కొన్ని సార్లు మేనేజ్మెంట్లు ఒక్కోసారి ఫామ్-16 ఇవ్వవు..
2022-23 ఆర్థిక సంవత్సరంలో మీ వేతనం, ఇతర ఆదాయం వివరాలు ఒక చోట రాసుకోవాలి. వేతనంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)లో జమ చేసిన మొత్తం, అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) వివరాలుంటాయి. వీటిని మినహాయింపుల కింద క్లయిమ్ చేసుకోవచ్చు.
వేతనం మినహా ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయం.. ఉదాహరణకు పొదుపు ఖాతా వడ్డీ, ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ, డివిడెండ్లు ఉన్నాయా.. తెలుసుకోవాలంటే బ్యాంకు ఖాతా డిటైల్స్ ఉంటాయి. బ్యాంకు ఖాతా వివరాలతో ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ లోకి వెళ్లి సేవింగ్స్ ఖాతాపై వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, కంపెనీల్లో వాటాలకు డివిడెండ్లు వివరాలు చెక్ చేసుకోవాలి.
ఆదాయం పన్ను విభాగం వెబ్‌సైట్‌కి వెళ్లి ఫామ్-16, ఏఐఎస్ అందుబాటులో ఉంటే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అందులో గల సమాచారంతో మీ దగ్గర ఉన్న డిటైల్స్ పోల్చుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. పన్ను మినహాయింపులు పోగా మిగిలిన ఆదాయానికి పన్ను వర్తించకున్నా ఐటీఆర్ దాఖలు చేయడం మరిచిపోవద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.