న్యూఢిల్లీ, అక్టోబర్ 25: దేశవ్యాప్తంగా ఆతిథ్య రంగం అంచనాలకుమించి రాణిస్తున్నది. బిజినెస్ ట్రావెల్స్, విదేశీ టూరిస్టులు అత్యధికంగా భారత్‌ను సందర్శిస్తుండటంతో దేశీయ ఆతిథ్య రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.
ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌తోపాటు ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 కూడా ఆతిథ్య రంగానికి ఊతమిస్తున్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్ల అక్యూపెన్సీ రేట్ 70-72 శాతం మేర ఉంటుందని ఇక్రా అంచనావేస్తున్నది. దేశవ్యాప్తంగా సరాసరి ప్రీమియం హోటల్ రూం గది రూ.6,000 నుంచి రూ.6,200 స్థాయిలో ఉన్నది.