బుధవారం 03 మార్చి 2021
Business - Jan 03, 2021 , 17:46:53

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులుండొచ్చు.. కానీ

ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులుండొచ్చు.. కానీ

న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డులు అత్యవసర సమయంలో చెల్లింపులకు మార్గాలు. పట్టణ ప్రాంతాలలో ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉండటం చాలా సాధారణం కూడా. ప్రత్యేకించి ఎగువ మధ్య తరగతి, ఉన్నత తరగతి కుటుంబాల్లో ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటాయి. పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి పలు క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటం వల్ల తమ సిబిల్‌/ క్రెడిట్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందా? అని క్రెడిట్‌ కార్డు దారులు తరుచుగా ఆశ్చర్య చకితులవుతూ ఉంటారు. 

కానీ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటం వల్ల ‘సిబిల్‌’ స్కోర్‌పై ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ చెల్లింపుల్లో క్రమశిక్షణ లేకపోయినా, క్రెడిట్‌ లిమిట్‌ను మించి వాడుకున్నా, పలుమార్లు ఎంక్వయిరీలు చేసినా సిబిల్‌ స్కోర్‌ మీద ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

సిబిల్‌ కం క్రెడిట్‌ స్కోర్‌ ప్రాథమికంగా 300-900 మధ్య కొనసాగుతూ ఉంటుంది. దీన్ని భారతదేశంలోని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీలు గణిస్తూ ఉంటాయి. క్రెడిట్‌ స్కోర్‌ 750కి మించి ఉంటే, అది రుణ గ్రహీతకు అసాధారణమైన, మంచి స్కోర్‌. అటువంటి వారు రుణాలు పొందేందుకు అర్హులు కూడా. క్రెడిట్‌ స్కోర్‌ 650 - 750 మధ్య ఉంటే యావరేజ్‌ అండ్‌ ఫెయిర్‌ స్కోర్‌ అని, 650 కంటే తక్కువగా ఉంటే దాని గురించి ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని అర్థం అని నిపుణులు చెబుతున్నారు. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న రుణ గ్రహీతకు బ్యాంకులు రుణాలివ్వడానికి అనర్హులుగా భావిస్తాయి. వారు రుణాలకు ఆమోదం పొందాలంటే సమస్యల్లో చిక్కుకుంటారు. 

క్రెడిట్‌ హిస్టరీ, రీ పేమెంట్‌ చరిత్ర, వాడకం, ఎంక్వైరీల సంఖ్య తదితర అంశాల ఆధారంగా సిబిల్‌ స్కోర్‌ రూపుదిద్దుకుంటుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉన్న వారు ఈ ప్రమాణాలను పాటించడం కష్టం కావచ్చు. ఈ పరిమితులు రుణ గ్రహీతల సిబిల్‌ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడేందుకు దారి తీయొచ్చు. 

సిబి‌ల్‌ స్కోరు ఖరారులో క్రెడిట్‌ కార్డు రీపేమెంట్‌ చరిత్ర చాలా ముఖ్యం. క్రెడిట్‌ కార్డు వాడకంపై ఈఎంఐలు, పూర్తి బిల్లు చెల్లింపులు సకాలంలో చేశారా? లేదా? అన్నదే ముఖ్యం. ప్రతీసారి రుణ గ్రహీత తన చెల్లింపులను మిస్‌ అయితే వారి సంబంధిత క్రెడిట్‌ షీట్‌లో నమోదవుతూ ఉంటుంది. క్రెడిట్‌ స్కోర్‌మీద ప్రభావం పడుతుంది. ఒకవేళ క్రెడిట్‌ బిల్లుల రీపేమెంట్‌ రికార్డు క్లీన్‌గా లేకపోతే బహుళ క్రెడిట్‌ కార్డులు ఉన్నా.. ఒక్కదాని చెల్లింపుల విషయంలో ఫెయిలైనా మొత్తం క్రెడిట్‌ స్కోర్‌ మీద తప్పనిసరిగా ప్రభావం ఉంటుంది. 

సిబిల్‌ స్కోర్‌ను నిర్దేశించడంలో మరో ముఖ్యమైన అంశం ఉంది అదే కార్డు యుటిలైజేషన్‌ అంశం. ఉదాహరణకు క్రెడిట్‌ లిమిట్‌ రూ.100 ఉందని అనుకుందాం.. అందులో ప్రతినెలా 60శాతం వాడితే సదరు వ్యక్తిని క్రెడిట్‌ హంగ్రీ లేదా డబ్బు కొరత సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిర్ధారణకు వస్తారు. కేవలం పది శాతం మాత్రమే వాడితే అవసరమైనప్పుడు మాత్రమే క్రెడిట్‌ కార్డు వాడుతున్నట్లు నిర్ధారించుకుంటారు. వారి పట్ల రుణ దాతల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడుతుందని అభిప్రాయ పడుతుంటారు. 

ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉన్న వారి విషయానికి వద్దాం.. రుణ గ్రహీత ఐదు క్రెడిట్‌ కార్డులు కలిగి ఉన్నాడని అనుకుందాం. కానీ వాటిపై పదిశాతం రుణం మాత్రమే వాడుకుంటే సదరు వ్యక్తులపై మంచి అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ 80-90 శాతం క్రెడిట్‌ ఫెసిలిటీని వాడుకున్నారనుకోండి. రుణాలు పొందడంపై వారు చాలా ఆకలితో ఉన్నారని, ఇది శుభ పరిణామం కాదని సంకేతం. అలాగని పలు క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటం వరకు ఒకే. కానీ రుణ గ్రహీత వాటి వాడకంలో సరైన నిష్పత్తిని పాటించాల్సి ఉంటుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. 

క్రెడిట్‌ కార్డుల వాడకంపై ఎంక్వైరీల సంఖ్య కూడా సిబిల్‌ స్కోర్‌ను నిర్దేశిస్తుంది. అధికంగా ఎంక్వైరీలు చేసేవారికి రుణాలు పొందడంపైనే యావ ఎక్కువ అన్న అభిప్రాయం స్థిరపడిపోతుంది. అవసరానికి అనుగుణంగా ఎంక్వైరీ చేయొచ్చు. 2 లేదా 3 క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటం సమస్య కాదు. కానీ ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు కలిగి ఉండటంతోపాటు తరుచుగా ఎంక్వైరీలు చేయడం సిబిల్‌ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo