(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్, హిండెన్‌బర్గ్ పరిశోధక సంస్థ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు, షేర్లలో అవకతవకలకు అదానీ గ్రూప్ పాల్పడుతున్నదంటూ ఈ నెల 24న ‘హిండెన్‌బర్గ్ రిసెర్చ్’ చేసిన విమర్శలు కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ ఆదివారం ఖండించింది.
భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్ ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నదని 413 పేజీలతో కూడిన ఓ ప్రకటనలో మండిపడింది. దీనిపై ‘హిండెన్‌బర్గ్ రిసెర్చ్’ సోమవారం స్పందించింది. జాతీయవాదం పేరుచెప్పి మోసాన్ని దాచిపెడుతున్నారని, తద్వారా దేశాన్ని క్రమపద్దతిలో దోచుకొంటున్నారని ధ్వజమెత్తింది. ‘దేశ భవిష్యత్తుకు అదానీ గ్రూపే అడ్డంకి. ఇది ముమ్మాటికీ నిజం. ఇదే మేము నమ్ముతున్నాం’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.
ఉద్దేశపూర్వక దాడి: అదానీ
అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన కుటుంబసభ్యులు గడిచిన కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డట్టు ఈ నెల 24న హిండెన్‌బర్గ్ ప్రచురించిన నివేదికపై ఆదివారం అదానీ గ్రూప్ స్పందించింది. భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్ తమ గ్రూప్‌పై అసత్య ఆరోపణలు చేసిందని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు యావత్తు దేశంపై జరుగుతున్న దాడిగా చెప్పుకొచ్చింది. నివేదికలో పేర్కొన్న ఆరోపణలన్నీ నిరాధారమైనవంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఇది ఒక కంపెనీపై చేసిన దాడి కాదు. భారత్, భారత స్వతంత్రత, సమైఖ్యత, విశ్వసనీయమైన భారతీయ సంస్థలు, దేశాభివృద్ధి గాథ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి’ అని అదానీ గ్రూపు అభివర్ణించింది. అదానీ ఎంటర్ప్రైజెస్.. ఎఫ్‌పీఓకు ముందే ఈ నివేదికను విడుదల చేయడం వెనక హిండెన్‌బర్గ్ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ పరిణామం ఆ సంస్థ విశ్వసనీయత, నైతికతపై సందేహాలు రేకెత్తిస్తున్నాయన్నది. మార్కెట్లో తప్పుడు ఆరోపణలు చేసి తద్వారా ఆర్థిక లాభాలు పొందాలన్నదే హిండెన్‌బర్గ్ ఉద్దేశంగా కనిపిస్తున్నదని మండిపడింది.
వినోద్ అదానీ కంపెనీ నిధుల గురించి తెలియదా?!
గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కంపెనీ నిధుల గురించి తమకు తెలియదంటూ అదానీ గ్రూప్ తన నివేదికలో వెల్లడించింది. దీనిపై హిండెన్‌బర్గ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ‘వినోద్ అదానీ, విదేశాల్లోని ఆయనకు చెందిన డొల్ల కంపెనీలతో అదానీ గ్రూప్ బిలియన్ డాలర్ల కొద్దీ అనుమానాస్పద లావాదేవీలు జరుపుతున్నట్టు నివేదికలో చెప్పాం. ఆ డొల్ల కంపెనీలతోనే అదానీ గ్రూప్.. ఖాతాల్లో మోసాలు, షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నదని రుజువులతో సహా బయటపెట్టాం. వినోద్ అదానీ కంపెనీలకు బిలియన్ డాలర్ల నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అదానీ గ్రూప్‌ను ఈ క్రమంలోనే ప్రశ్నించాం. కానీ వీటికి అదానీ గ్రూప్ తన 413 పేజీల స్పందనలో జవాబు చెప్పలేదు. అంతేకాకుండా.. వినోద్‌కి అదానీ గ్రూప్‌తో ఎలాంటి సంబంధంలేదని, వినోద్ కంపెనీ నిధుల గురించి తమకు తెలియదని బదులిచ్చింది. ఇది ఆశ్చర్యకరం’ అంటూ హిండెన్‌బర్గ్ దుయ్యబట్టింది. అదానీ గ్రూప్ సమాధానం అబద్ధమని తెలిపింది.
మోసం దాగదు: హిండెన్‌బర్గ్
అదానీ గ్రూప్ స్పందనను హిండెన్‌బర్గ్ ఖండించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ తీవ్రస్థాయిలో బదులిచ్చింది. ‘అవర్ రిైప్లె టు అదానీ: ఫ్రాడ్ కెనాట్ బీ అబ్ఫస్కేటెడ్ బై నేషనలిజమ్ ఆర్ ఏ బ్లోలెడ్ రెస్పాన్స్ దట్ ఇగ్నోర్స్ ఎవ్రీ కీ అలిగేషన్ వుయ్ రేయిజ్డ్’ పేరిట సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి అదానీ గ్రూప్ ప్రయత్నిస్తున్నదన్న హిండెన్‌బర్గ్.. ఈ క్రమంలోనే జాతీయవాద అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నదని ధ్వజమెత్తింది. అందుకే భారత్‌పై దాడి చేసేందుకే మా నివేదిక అన్నట్లు పెద్దయెత్తున అసత్య ప్రచారం చేస్తున్నదని, దీన్ని తాము ఎంతమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేసింది.
భారత్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశమని, ఉజ్వల భవిష్యత్తుతో అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతున్నట్టు తాము నమ్ముతున్నామని ఈ సందర్భంగా హిండెన్‌బర్గ్ వెల్లడించింది. అయితే జాతీయవాదం ముసుగులో దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటున్న అదానీ గ్రూప్.. దేశ భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతున్నదని, ఇది ముమ్మాటికీ నిజమని తాము నమ్ముతున్నట్టు తెలిపింది. ప్రపంచంలోని కుబేరుడైనా, ఏమీతెలియని అనామకుడైనా మోసం ఎప్పటికీ మోసమేనని, జాతీయవాదం పేరు చెప్పి లేదా అస్పష్టమైన సమాధానాలతో మోసాన్ని దాచి ఉంచలేరని వివరించింది.
తమ నివేదికలో 88 ప్రశ్నలడిగితే అందులో 62 కీలక ప్రశ్నలకు అదానీ గ్రూప్ సమాధానాలు చెప్పలేదెందుకనిప్రశ్నించింది.అడిగినప్రశ్నలకుస్పష్టమైనసమాధానాలుచెప్పకుండాతమపైనిందలువేయడమేంటనిమండిపడింది. అదానీ గ్రూప్ అసంబద్ధ సమాధానాలను చూస్తే, తమ రుజువులు నిజమని అర్థమవుతున్నదని, ప్రధాన ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ఆ గ్రూప్ తప్పించుకొన్నదని ధ్వజమెత్తింది.
ప్రశ్నించే హక్కు మాకున్నది: ఎల్ఐసీ
అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ స్పందించారు. అదానీ గ్రూప్ వివాదంలో ప్రస్తుత వాస్తవ పరిస్థితి తెలియనప్పటికీ.. గ్రూప్‌లో అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున.. హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఒకట్రెండు రోజుల్లో అదానీ గ్రూప్‌ను ప్రశ్నిస్తామని, ప్రశ్నలు అడిగే హక్కు తమకున్నదని పేర్కొన్నారు. ఈ మేరకు రాయిటర్స్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
36,475 కోట్లు పెట్టుబడి పెట్టాం
అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులపై సోమవారం ఎల్ఐసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటిదాకా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఈక్విటీ, డెట్ రూపంలో పెట్టిన పెట్టుబడులు రూ.36,474.78 కోట్లుగా ఉన్నట్టు స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికైతే రూ.35,917.31 కోట్లేనన్నది. ఈ క్రమంలోనే గడిచిన చాలా సంవత్సరాలుగా అదానీ గ్రూప్‌లోని అన్ని సంస్థల్లో కొనుగోలు చేసిన ఈక్విటీ విలువ రూ.30,127 కోట్లని పేర్కొన్న ఎల్ఐసీ.. ఈ నెల 27 నాటికి దీని మార్కెట్ విలువ రూ.56,142 కోట్లుగా ఉన్నట్టు వివరించింది. కాగా, నిరుడు సెప్టెంబర్ ఆఖరుకల్లా తమ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) రూ.41.66 లక్షల కోట్లుగా ఉందని, అందులో అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు ఒక శాతం (0.975 శాతం)లోపేనని ఎల్ఐసీ ఈ సందర్భంగా చెప్పింది. ఇక ఎల్ఐసీ పెట్టుబడులు పెట్టిన అదానీ డెట్ సెక్యూరిటీలన్నింటి క్రెడిట్ రేటింగ్ ‘ఏఏ’గానే ఉందని గుర్తుచేసింది. బీమా రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నట్టు ఎల్ఐసీ తాజా ప్రకటనలో వెల్లడించింది.
హిండెన్‌బర్గ్ ప్రశ్నలు-అదానీ గ్రూప్ సమాధానాలు-
జూన్ 24: అదానీ గ్రూప్ గడిచిన కొన్ని దశాబ్దాలుగా తమ షేర్లలో అవకతవకలకు పాల్పడుతూ, ఖాతాల్లో మోసాలు చేస్తున్నది. పన్ను ఎగవేసేందుకు వీలుగా విదేశాల్లోని డొల్ల కంపెనీల ద్వారా పెట్టుబడులు సమకూర్చుకొంది: హిండెన్‌బర్గ్ రీసెర్చ్
జూన్ 29: భారతీయ సంస్థలు సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే హిండెన్‌బర్గ్ ఈ అసత్య ఆరోపణలు చేసింది. భారత్, భారత స్వతంత్రత, సమైఖ్యత, భారతీయ సంస్థలు, దేశాభివృద్ధి గాథ, ఆశయాలపై ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న దాడి: అదానీ గ్రూప్
జూన్ 30: జాతీయవాదం పేరుచెప్పి మోసాన్ని దాచిపెట్టలేరు. జాతీయవాదం ముసుగులో దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకొంటున్నవాళ్లు మీరు. దేశ భవిష్యత్తుకు అదానీ గ్రూప్ అడ్డంకిగా మారింది. ఇదే మేం నమ్ముతున్నాం: హిండెన్‌బర్గ్ రీసెర్చ్
3 రోజుల్లో రూ.5.56 లక్షల కోట్లు
అదానీ కంపెనీల్లో కరిగిన సంపద
న్యూఢిల్లీ, జనవరి 30: బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ వ్యాపారంపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో సోమవారం సైతం పలు అదానీ గ్రూప్ కంపెనీల క్షీణత కొనసాగింది. దీంతో కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లో ఈ కంపెనీల మార్కెట్ విలువ రూ.5.56 లక్షల కోట్ల మేర తరిగిపోయింది.
ఎఫ్‌పీవోకి 3 శాతమే సబ్స్క్రిప్షన్
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవో ప్రారంభమైన తర్వాత రెండో ట్రేడింగ్ రోజైన సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి 3 శాతం మాత్రమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీవో బిడ్డింగ్‌కు జనవరి 31 చివరితేదీ.
ఫోర్బ్స్ జాబితాలో 8వ స్థానానికి..
సోమవారం కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనంచెందడంతో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ స్థానం మరింత తగ్గింది. గత శుక్రవారం ఏడో స్థానంలో ఉన్న అదానీ సంపద తాజాగా 88.2 బిలియన్లకు పడిపోవడంతో శ్రీమంతుల జాబితాలో 8వ స్థానానికి దిగివచ్చారు.
గమనిస్తున్నాం: పీఎన్బీ
అదానీ గ్రూపులో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అతుల్ కుమార్ గోయల్ అన్నారు. అదానీ గ్రూపునకు సంబంధించిన అన్ని సంస్థలకు రూ.7 వేల కోట్ల రుణాలతోపాటు ఎయిర్పోర్ట్ వ్యాపారానికి మరో రూ.2,500 కోట్లు రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. నగదు నిల్వలు ఎక్కువగా ఉండటంతో అత్యధికంగా రుణాలు మంజూరు చేసినట్లు, వీటిలో బ్యాంక్ కూడా రూ.42 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణాలపై ఎలాంటి భయాలు లేవని, ప్రస్తుతం గ్రూపులో నెలకొన్న అన్ని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ నికర లా భం ఏడాది ప్రాతిపదికన 44 శాతం తగ్గి రూ.629 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇది రూ.1,127 కోట్లుగా ఉన్నది.