Adani | న్యూఢిల్లీ, ఆగస్టు 12: దేశీయ స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు మరోమారు మూకుమ్మడిగా కుప్పకూలాయి. శనివారం మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బచ్ దంపతులపై అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఈక్విటీ మార్కెట్లు షేక్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆరంభంలో భారీ నష్టాల దిశగా సూచీలు పయనించాయి. అదానీ గ్రూప్‌నకు చెందిన 10 సంస్థల షేర్లు పెద్ద ఎత్తున క్షీణించాయి. ఫలితంగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఒక్కసారిగా దాదాపు రూ.1.13 లక్షల కోట్లు (13.4 బిలియన్ డాలర్లు) హరించుకుపోయింది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ అటు సూచీలు, ఇటు షేర్లు తిరిగి కోలుకున్నాయి. అయినప్పటికీ మెజారిటీ షేర్లు నష్టాలకే పరిమితం కావడం గమనార్హం.
అంబుజా సిమెంట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ స్వల్పంగా లాభపడ్డాయి. మిగతా 8 షేర్లు 4.14 శాతం నుంచి 0.65 శాతం మేర దిగజారాయి. దీంతో ఆయా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులకు రూ.22,064 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక మొత్తంగా చూసినైట్టెతే బీఎస్ఈలోని 11 అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లపైనే. కాగా, సెబీ చీఫ్ మాధవి పురి, ఆమె భర్త ధవల్ బచ్.. బెర్ముడా, మారిషస్‌ల్లోని ఫండ్లలో పెట్టుబడులు పెట్టారని, అవి అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ కనుసన్నల్లో నడుస్తున్నవంటూ హిండెన్‌బర్గ్ ఓ ‘విజిల్‌బ్లోయర్’ డాక్యుమెంట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ అక్రమాలపై సెబీ విచారణ తూతూ మంత్రంగా సాగిందని ఆరోపించిన సంగతీ విదితమే. అయితే వీటిని ఆదివారం బచ్ దంపతులు కొట్టిపారేశారు. అదానీ గ్రూప్ సైతం వీరితో తమకెలాంటి వాణిజ్య సంబంధాల్లేవని స్పష్టం చేసింది. గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ హిండెన్‌బర్గ్ విడుదల చేసిన నివేదిక.. భారతీయ స్టాక్ మార్కెట్లలో అల్లకల్లోలం సృష్టించినది తెలిసిందే. అదానీ కంపెనీల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా పడిపోయింది.
ఏడాదిన్నర క్రితం అదానీ గ్రూప్ ప్రధాన లక్ష్యంగా తొలి రిపోర్టును విడుదల చేసిన హిండెన్‌బర్గ్.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రెండో నివేదికను తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ తరహా రిపోర్టులు మరిన్ని భారతీయ సంస్థలపై రావచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. హిండెన్‌బర్గ్ వంటి ఇంకొందరు అమెరికా షార్ట్-సెల్లర్లు ఈ దిశగా రిసెర్చ్ చేస్తున్నారన్న అభిప్రాయాలను వారు వెల్లడిస్తుండటం సర్వత్రా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. మొత్తానికి భారతీయ సంస్థలపైనే షార్ట్-సెల్లర్ల గురి ఉందన్నది స్పష్టంగా తెలుస్తున్నది. దీంతో బడా కార్పొరేట్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలవుతున్నాయి. మార్కెట్ అక్రమాలు, డొల్ల కంపెనీలు, నిధుల గోల్మాల్, కేంద్ర ప్రభుత్వ పెద్దలు-ఉన్నతాధికారుల హస్తం అన్నింటిపైనా షార్ట్-సెల్లర్లు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 56.99 పాయింట్లు పడిపోయి 79,648.92 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 20.50 పాయింట్లు కోల్పోయి 24,347 వద్ద స్థిరపడింది. అయితే ఒకానొక దశలో సెన్సెక్స్ 479.78 పాయింట్లు, నిఫ్టీ 155.40 పాయింట్లు దిగజారాయి. సెన్సెక్స్ షేర్లలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, నెస్లే షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. రంగాలవారీగా యుటిలిటీస్, ఎఫ్ఎంసీజీ నిరాశపర్చాయి. ఆసియా మార్కెట్లలో కొరియా, హాంకాంగ్ లాభాల్లో, చైనా నష్టాల్లో ముగిశాయి.
హిండెన్‌బర్గ్ తాజా ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్లలో వివిధ మ్యూచువల్ ఫండ్స్ పెట్టిన పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయిప్పుడు. ముఖ్యంగా రిటైల్ మదుపరుల్లో టెన్షన్ మొదలైంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన మొత్తం 11 అదానీ గ్రూప్ సంస్థల్లో ఎన్డీటీవీ మినహా మిగతా 10 కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా జరిగిన పెట్టుబడులు వాల్యూ రిసెర్చ్ వివరాల ప్రకారం ఈ ఏడాది జూలై ఆఖరు నాటికి రూ.41,814 కోట్లుగా ఉన్నాయి. అయితే టాప్-5 సంస్థల్లోని పెట్టుబడులే రూ.41వేల కోట్లు గా ఉండటం గమనార్హం. ఇందులో అత్యధికంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లో రూ.13,024 కోట్ల మేర ఉన్నాయి. అత్యల్పంగా సంఘీ ఇండస్ట్రీస్ రూ.5.95 కోట్లుగా ఉన్నాయి.