EPFO | ప్రస్తుతం వివిధ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు.. రిటైర్మెంట్ తర్వాత జీవనం కోసం అధిక పెన్షన్ కావాలని ఆశ పడుతుంటారు.. కానీ కొత్త పెన్షన్ స్కీం కింద ఆ అవకాశం లేదు. ఈ నేపథ్యంలో అధిక పెన్షన్ కోరుకునే వారికి ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (Employees’ Provident Fund Organisation (EPFO) ఓ ఆప్షన్ ఇచ్చింది. ఉద్యోగితోపాటు యాజమాన్యం కలిసి జాయింట్ ఆప్షన్ ఫామ్ ఫైల్ చేయాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆప్షన్ క్లయిమ్ చేయడానికి వచ్చే నెల మూడో తేదీ చివరి తేదీ. అంటే సరిగ్గా ఆరు రోజుల గడువు మాత్రమే ఉంది.
ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు విడిగా అప్లయి చేసుకోవచ్చు. యాజమాన్యంతో కలిసి అధిక పెన్షన్ కోసం ఉద్యోగి సమర్పించే జాయింట్ ఆప్షన్లో ఆ వ్యక్తి వేతనం, సమాచార పరిశీలనకు కొత్త సర్క్యులర్ జారీ చేసింది ఈపీఎఫ్‌వో. అధిక పెన్షన్ కోసం వచ్చే దరఖాస్తులు, జాయింట్ ఆప్షన్లను ఫీల్డ్ ఆఫీసర్లు తనిఖీ చేస్తారని పేర్కొంటూ ఈ నెల 23న సర్క్యులర్‌లో తెలిపింది. అవసరమైతే, అందుబాటులో ఉన్న డేటా ప్రకారం యాజమాన్యాలు సమర్పించే వేతన వివరాలను ఫీల్డ్ అధికారులు తనిఖీ చేస్తారు.
అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, యాజమాన్యాలు జాయింట్ ఆప్షన్ సమర్పించాలని ప్రతిపాదించిన ఈపీఎఫ్‌వో.. దీన్ని ఆటోమేటిక్ అని పేర్కొన్నదని సాగ్ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా తెలిపారు. అధిక పెన్షన్ ఆటోమేటిక్ కాదన్నారు. అధిక పెన్షన్ కోరుకునే ఉద్యోగులు అందుకు తమ అర్హతలను రుజువు చేసుకోవాల్సిన బాధ్యతల్ని కూడా వారిపైనే పెట్టింది ఈపీఎఫ్‌వో. పెన్షన్ అర్హతలు, అర్హతల ధృవీకరణ ప్రక్రియపై ఈపీఎఫ్‌వో యాజమాన్యం అస్పష్ట ప్రకటనతో సభ్యుల్లో గందరగోళం నెలకొందని అమిత్ గుప్తా పేర్కొన్నారు.
అధిక పెన్షన్‌కు అర్హులైన ఉద్యోగి తప్పనిసరిగా తన ప్రావిడెండ్ ఫండ్ నుంచి పెన్షన్ ఫండ్‌కు నిధులను బదిలీ చేసేందుకు అనుమతి ఇస్తూ అగ్రిమెంట్, రూ.5000 / రూ.6500 పరిమితి కంటే ఎక్కువ వేతనంపై పీఎఫ్‌లో యాజమాన్యం వాటాపై ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో వాస్తవ వేతనంపై ఈపీఎఫ్‌లో ఉద్యోగి, యాజమాన్యం అధిక భాగస్వామ్యం వాటా 8.33 శాతం కంటే ఎక్కువ ఉంటుందని అమిత్ గుప్తా తెలిపారు.
అర్హులైన ఉద్యోగులంతా ఈపీఎఫ్‌వో (EPFO) పోర్టల్‌లోకి వెళ్లి.. అందులో పేర్కొన్న మేరకు డాక్యుమెంట్లు ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అప్లికేషన్లో నింపాలి. యూఏఎన్ మెంబర్ ఈ-సేవ పోర్టల్ UAN Member e-SEWA portal (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) లోకి వెళ్లి వివరాలు నింపొచ్చు. అడిగిన వివరాలన్నీ ఫీడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.