హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : వ్యాపారి చిరునామా మార్చుకుని ఐటీ రిటర్నులు దాఖలు చేస్తే, పాత అడ్రస్ ప్రకారం పన్ను చెల్లించడం లేదని ఎలా చెప్తారంటూ జీఎస్టీ వర్గాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ అక్షయ ఆయిల్ రిఫైనర్ పార్టనర్‌గా ఉన్న తాను అడ్రస్ మార్పు చేసినప్పటికీ పాత అడ్రస్‌కు పన్నులు చెల్లించట్లేదని నోటీసు ఇచ్చారంటూ వ్యాపారి ఎం సుబ్బయ్య హైకోర్టును ఆశ్రయించారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దుతోపాటు రూ.3 కోట్ల బకాయిలను రాబట్టేందుకు బ్యాంకు ఖాతాను సీజ్ చేశారన్నారు. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. సోమాజిగూడ సరిల్ జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వ్యక్తిగతంగా హాజరై అధికారుల పొరపాటు వల్ల జరిగిందంటూ క్షమాపణలు చెప్పారు. దీంతో బాధ్యుడైన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పింది. పిటిషనర్‌కు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది.