ముంబై, జనవరి 16: హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఝలక్ ఇచ్చింది. పబ్లిక్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తూ తాజాగా పలు ప్రతిపాదనల్ని చేసింది. ఈ క్రమంలోనే డిపాజిట్ల మెచ్యూరిటీ కాలాన్ని ఐదేండ్లకు తగ్గించాలని నిర్ణయించింది. అంతేగాక చెల్లింపులకుగాను ఉండాల్సిన లిక్విడ్ అసెట్స్ పెంచాలని కూడా చూస్తున్నది. ప్రస్తుతం ఏడాది నుంచి పదేండ్లదాకా మెచ్యూరిటీ డిపాజిట్లను హెచ్ఎఫ్సీలు తీసుకోవచ్చు. అయితే దీన్ని ఏడాది నుంచి ఐదేండ్లకే ఆర్బీఐ కుదిస్తున్నది. కానీ ఇప్పటికే ఉన్న డిపాజిట్లు మాత్రం పాత నిబంధనల ప్రకారమే మెచ్యూరిటీ అవుతాయి. ఇక డిపాజిట్ల కోసం హెచ్ఎఫ్సీలు మెయింటేన్ చేయాల్సిన లిక్విడ్ అసెట్స్ ఇప్పుడు 13 శాతంగా ఉండాలి. అయితే వచ్చే మార్చి ఆఖరుకల్లా 15 శాతానికి పెంచనున్నారు. కాగా, ప్రస్తుతం మార్కెట్లో 9 హెచ్ఎఫ్సీలు డిపాజిట్లను తీసుకుంటున్నాయి. వాటిలో ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ కంపెనీ, ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ, మణిపాల్ హౌజింగ్ ఫైనాన్స్ సిండికేట్, పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్, సుందరం హోమ్ ఫైనాన్స్, కెన్ ఫిన్ హోమ్స్, సెంట్ బ్యాంక్ హోమ్ ఫైనాన్స్, ఆధార్ హౌజింగ్ ఫైనాన్స్, హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నాయి. నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వివరాల ప్రకారం సరళ్ హోమ్ ఫైనాన్స్, జీఐసీ హౌజింగ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ కూడా డిపాజిట్లను అనుమతిస్తున్నాయి. అయితే ముందుగా ఎన్‌హెచ్‌బీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సవరించిన ఫెయిర్ లెండింగ్ విధానం అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఇది రుణ ఎగవేతలపై ఇష్టారీతిన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు జరిమానాలు వేయకుండా నిరోధిస్తుంది. గత ఏడాది ఆగస్టు 18న ఆర్బీఐ ఈ కొత్త నిబంధనల్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఆగస్టు నుంచి కీలక వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించవచ్చని జపాన్ బ్రోకరేజీ దిగ్గజం నోమురా అంచనా వేసింది. ఆగస్టు నుంచి వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటు 1 శాతం తగ్గేందుకు వీలున్నట్టు పేర్కొన్నది. ద్రవ్యోల్బణం మున్ముందు తగ్గుముఖం పడితే వడ్డీరేట్లు ఇంకా దిగిరావచ్చన్నది. ఈ నేపథ్యంలోనే జనవరిలో రిటైల్ ధరల సూచీ 5 శాతం దరిదాపుల్లోకి రావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కాగా, డిసెంబర్లో 4 నెలల గరిష్ఠాన్ని తాకుతూ రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా, 9 నెలల గరిష్ఠాన్ని చేరుతూ టోకు ద్రవ్యోల్బణం 0.73 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని అడ్డుకునేందుకే ఆర్బీఐ వరుస వడ్డింపుల్లో రెపోరేటును 2.5 శాతం పెంచిన సంగతి విదితమే. ప్రస్తుతం రెపో 6.5 శాతం గా ఉన్నది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర రుణాలన్నీ ప్రియమైపోయాయి. రుణగ్రహీతలపై ఈఎంఐల భారం కూడా పెరిగిపోయింది. నిజానికి కరోనా సమయంలో దిగాలు పడిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపర్చేందుకు రెపోరేటును ఆర్బీఐ పెద్ద ఎత్తున తగ్గించింది. ఫలితంగా అంతా రుణాలను తీసుకుని ఇండ్లు, వాహనాలను కొన్నారు. రియల్ ఎస్టేట్, ఆటో రంగాలకు ఇది ఎంతగానో కలిసొచ్చింది. అయితే కరోనా తగ్గడం, ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడంతో రెపోను ఆర్బీఐ పెంచేసింది.