Home Loans | ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ రెపోరేట్ పెంచీ పెంచడంతోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రంగంలోకి ఎంటరైంది. తక్షణం రుణాలపై వడ్డీరేట్లు పెంచేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో ఇండ్ల రుణాల నెలసరి వాయిదా (ఈఎంఐ)లు మరింత భారం కానున్నాయి.
ఇండ్ల రుణాలపై హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) సవరించింది. ఇండ్ల రుణాలపై ఆర్పీఎల్ఆర్ 50 బేసిక్ పాయింట్లు సవరిస్తున్నామని తెలిపింది. సవరించిన వడ్డీరేట్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. పెరిగిపోతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ నాలుగు సార్లు రెపోరేట్ పెంచితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఐదు నెలల్లో ఏడు సార్లు ఆర్పీఎల్ఆర్ పెంచేయడం గమనార్హం.
ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లు పెంచనున్నాయి. మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ఆర్బీఐ నుంచి ముగ్గురు, మరో ముగ్గురు ఇతర నిపుణులు సభ్యులుగా ఉంటారు. మొత్తం ఆరుగురిలో ఐదుగురు వడ్డీరేట్ల పెంపునకు ఆమోదం తెలిపారు. 2019 ఏప్రిల్ నుంచి రెపోరేట్ 5.90 శాతానికి చేరుకోవడం ఇదే తొలిసారి.