హైదరాబాద్, జూలై 8: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడనున్నది. దీంతో ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతం నుంచి 9.40 శాతం మధ్యలోకి చేరింది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు కాలపరిమితి రుణాలపై వడ్డీరేటుని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 8.95 శాతం నుంచి 9.05 శాతానికి చేరుకున్నది. అలాగే నెల కాలపరిమితితో రుణాలపై వడ్డీ 9 శాతం నుంచి 9.10 శాతానికి పెరగగా..మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 5 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 9.15 శాతం నుంచి 9.20 శాతానికి చేరుకున్నది.
ఆరు నెలల రుణాలపై రేటు 9.30 శాతం నుంచి 9.35 శాతానికి చేరుకోగా, ఏడాది రుణాలపై రేటు 9.30 శాతం నుంచి 9.40 శాతానికి సవరించింది. రెండేండ్లు, మూడేండ్ల రుణాలపై రేటుని 9.40 శాతానికి సవరించింది బ్యాంక్. వీటితోపాటు బ్యాంక్ బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుని 17.90 శాతానికి, బేస్రేటుని 9.40 శాతానికి పెంచింది.