హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : బకాయిల వసూలులో భాగంగా విమాన విడిభాగాల తయారీ సంస్థ టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (టీఎల్ ఎంఏఎల్)పై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ కఠిన చర్యలు తీసుకోరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 వరకు నిషేధిత జాబితాలో ఉంచి ఖాతాలు స్తంభింపజేయరాదని ఉత్తర్వుల్లో పేరొంది.
2012 నుంచి 2017 మధ్యకాలంలో పనిచేసిన 14 మంది విదేశీ కార్మికులకు పీఎఫ్ జమ చేయకపోవడంతో ఈపీఎఫ్ఓ ఈ కంపెనీని నిషేధిత జాబితాలో చేర్చి బ్యాంకు ఖాతాను స్తంభింపజేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఈచర్యను టీఎల్ ఎంఏఎల్ సంస్థ సవాలు చేసిన పిటిషన్ను జస్టిస్ పుల్లా కార్తీక్ ఇటీవల విచారించారు. సంస్థ ఇప్పటికే రూ.4 కోట్లు డిపాజిట్ చేసిందని, మిగిలిన రూ.10 కోట్లలో రూ.4.30 కోట్లు రికవరీ కూడా చేసినట్టు కంపెనీ తరుపున వాదిస్తున్న న్యాయవాది తెలిపారు.