Hardeep Singh Puri : పశ్చిమాసియా దేశాలైన ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇరుదేశాలు బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు తెగబడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలకు రెక్కలు వస్తాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) స్పందించారు.
ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధం కారణంగా చమురు ధరలపై ప్రభావం పడుతుందని అంగీకరించిన ఆయన.. అయితే ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని అన్నారు. ‘జూన్ 13 నుంచి ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో, అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర పెరగడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ లీటర్‌పై పెంపు పక్కా అనే కథనాల్ని గురువారం హర్దీప్ సింగ్ కొట్టిపారేశాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగుతున్న ఈ సమయంలో అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. అయితే.. ఈ సిట్యూయేషన్ నుంచి బయటపడగలమనే నమ్మకం మా ప్రభుత్వానికి ఉంది.
ప్రస్తుతానికైతే చమురు ధరలు స్థిరంగా, నియంత్రణలోనే ఉన్నాయి. అంతేకాదు అంతర్జాతీయంగా చమురుకు కొరత కూడా లేదు. సో.. అందోళన అవసరం లేదు. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధాన్ని మేము జాగ్రత్తగా గమనిస్తున్నాం. కొందరు అంటున్నారు ధరలు 100 మార్క్ దాటుతాయని. కానీ, ధరలు రూ.75 దాటలేదు’ అని హర్దీప్ సింగ్ వెల్లడించారు.