న్యూఢిల్లీ, అక్టోబర్ 1: గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. గత నెలకుగాను రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.63 లక్షల కోట్లతో పోలిస్తే 6.5 శాతం అధికమని పేర్కొంది. ఆగస్టు నెలలో వసూలైన రూ.1.75 లక్షల కోట్ల కంటే ఇది తక్కువ. గత 40 నెలల్లో ఇంతటి తక్కువ స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి.
దేశీయంగా వసూళ్లు తగ్గుముఖం పట్టడం, దిగుమతులు కూడా నిరాశాజనకంగా ఉండటం వల్లనే గత నెల వసూళ్లలో వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైందని పన్ను విశ్లేషకులు చెబుతున్నారు. గత నెలలో దేశీయ వ్యాపార కార్యకలాపాల ద్వారా రూ.1.27 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, దిగుమతులపై రూ.45,390 కోట్లు లభించాయి. అలాగే రిఫండ్ రూపంలో రూ.20,458 కోట్లు చెల్లింపులు జరిపింది.
గత నెలలో పలు రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లలో ప్రతికూల వృద్ధి నమోదైంది. మణిపూర్‌లో అత్యధికంగా 33 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, గుజరాత్లో స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలో ఒక్క శాతం అధికమవగా, రాజస్థాన్‌లో 2శాతం, ఉత్తరప్రదేశ్ 3 శాతం, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో 5 శాతం చొప్పున పెరిగాయి.