న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: విమాన చార్జీలు భారీగా పెరగనున్నాయి. టికెట్ ధరపై ఒక్కసారిగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం 50 శాతం పెరగబోతున్నది మరి. ఈ నెల 22 నుంచి ఎకానమీ మినహా మిగతా తరగతుల విమాన టికెట్లపై జీఎస్టీ 18 శాతం పడబోతున్నది. ప్రస్తుతం ఇది 12 శాతంగానే ఉండటం గమనార్హం. దీంతో ఇక ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ ప్రయాణికులు 6 శాతం పన్నును అదనంగా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.
ఈ నెల 3న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 4 స్లాబుల పన్ను విధానం స్థానంలో 2 స్లాబులనే సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. 12, 28 శాతం స్లాబులను తొలగించి.. 5, 18 శాతం స్లాబులనే కొనసాగించాలని తీర్మానించినట్టు సమావేశం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే ఆరోగ్యానికి హానికరమైనవి, లగ్జరీ వస్తూత్పత్తులు, సేవలపై గరిష్ఠంగా 40 శాతం పన్నును నిర్ణయించినట్టు చెప్పారు. ఆయా వస్తూత్పత్తులు, సేవలపై కొత్త స్లాబుల ప్రకారం మారిన రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.
ఉదాహరణకు.. ఈ నెల 24న ప్రయాణించేందుకు, ఈ నెల 4నే మీరు ఓ బిజినెస్ క్లాస్ విమాన సీటును బుక్ చేసుకున్నారు. అప్పుడు మీ టికెట్ ధరపై 12 శాతం జీఎస్టీనే చెల్లించారు. అయితే ఇదే టికెట్‌ను ఈ నెల 23న బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్లు దీప్ కొరాడియా, మానస్ చుగ్, అంకిత్ జోషి మాట్లాడుతూ.. ‘జీఎస్టీ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పన్ను రేట్లు మారక ముందు ఇన్వాయిస్, పేమెంట్ జరిగితే.. ఆ పన్ను రేట్లు మారిన తర్వాత సదరు సేవలు పొందినా పాత ధరలే వర్తిస్తాయి’ అంటున్నారు.
జీఎస్టీ రేట్లు మారకముందు టికెట్ బుక్ చేసుకుని, రేట్లు పెరిగిన తర్వాత ఒకవేళ ఆ టికెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే సదరు విమానయాన సంస్థ అప్పుడు చెల్లించిన ధర (12 శాతం జీఎస్టీ)నే రిఫండ్ చేస్తుంది. మారిన 18 శాతం రేటుతో చెల్లించదని చార్టర్డ్ అకౌంటెంట్ దీప్ కొరాడియా తెలిపారు. అయితే ఆ విమానయాన సంస్థ అనుసరించే క్యాన్సిలేషన్ చార్జీలు వర్తించే వీలున్నది. అంతేగానీ క్యాన్సిల్ చేసుకున్న టికెట్‌పై గతంలో వసూలు చేసిన జీఎస్టీని తిరిగి రిఫండ్ చేయవద్దని జీఎస్టీ చట్టంలో లేదని కొరాడియా చెప్పారు. కాబట్టి ఏదైనా కారణం చేత టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే.. చెల్లించిన జీఎస్టీ సహా ఆ టిక్కెట్ ధరను విమానయాన కంపెనీ తప్పక ఇచ్చి తీరుతుందన్నారు.
జీఎస్టీ పెరుగుదల విమానయాన రంగానికి పెద్ద దెబ్బేనని పరిశ్రమ వర్గాలు, నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ఏవియేషన్ ఇండస్ట్రీ.. గత కొంతకాలం నుంచే తిరిగి కోలుకుంటున్నదని వారంతా గుర్తుచేస్తున్నారు. అయితే జీఎస్టీ పెంపుతో టిక్కెట్ ధరలు పెరుగుతాయని దీంతో ప్రయాణీకుల సంఖ్య పడిపోవచ్చన్న ఆందోళనల్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రయాణీకులపై ఆ భారం పడకుండా చూస్తే.. కంపెనీలకు నష్టమని పేర్కొంటున్నారు. ఏదైనా ఈ నిర్ణయం విమానయాన రంగం వృద్ధికి ఇబ్బందేనని చెప్తున్నారు. ఇక ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలూ జీఎస్టీ పెంపును విమర్శించిన విషయం తెలిసిందే.