న్యూఢిల్లీ, అక్టోబర్ 31: గడువు దాటాక మూడేండ్లు, అంతకన్నా ఎక్కువకాలం నుంచి పెండింగ్‌లో ఉంటున్న వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రిటర్నులను నవంబర్ ట్యాక్స్ పీరియడ్ నుంచి వ్యాపార సంస్థలు దాఖలు చేయడం కుదరదని జీఎస్టీ నెట్వర్క్ ప్రకటించింది. సదరు రిటర్నుల ఫైలింగ్‌ను తిరస్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నది. జీఎస్టీ నమోదిత వ్యాపార సంస్థలకు చెందిన నెల, త్రైమాసిక, వార్షిక రిటర్నులన్నింటి పరిస్థితి ఇంతేనని స్పష్టం చేసింది. ఈ మేరకు జీఎస్టీ పోర్టల్ అప్‌గ్రేడై ఉంటుందని తాజా అడ్వైజరీలో తెలిపింది.
కాగా, 2023లో కేంద్ర ప్రభుత్వం.. గడువు దాటిన జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్‌కు సంబంధించి నిర్దిష్ట సమయాన్ని సూచించింది. మూడేండ్లు మించితే ఫైలింగ్‌ను నిషేధిస్తామని పేర్కొంటూ జీఎస్టీ చట్ట సవరణలు చేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2022 అక్టోబర్‌తోనే గడువు తీరిన నెలవారీ జీఎస్టీ రిటర్న్ ఫారాలు జీఎస్టీఆర్-1, జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్ కుదరదు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక జీఎస్టీ రిటర్న్ ఫారం జీఎస్టీఆర్-9ను కూడా దాఖలు చేయలేము.
రూ.32 కోట్ల జీఎస్టీ ఎగవేతలతో ప్రమేయమున్న నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయింల మోసాన్ని జీఎస్టీ అధికారులు బట్టబయలు చేశారు. ఈ కేసులో ఒకరిని ఢిల్లీ సీజీఎస్టీ సౌత్ కమిషనరేట్‌కు చెందిన అధికారులు అరెస్టు కూడా చేశారని శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి వస్తు సరఫరా లేదా సేవలను అందించకుండానే నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా ఐటీసీ క్లెయింలకు ఓ సంస్థ పాల్పడిందని చెప్పింది. దాదాపు రూ.31.95 కోట్ల జీఎస్టీని ఎగవేశారని పేర్కొన్నది.