GST Collections | జూలై మాసంలో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూలయ్యాయి. రూ.1,48,995 కోట్ల జీఎస్టీ వసూలైందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది జూలైతో పోలిస్తే 28శాతం అధికమని ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీని అమలులోకి వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో జీఎస్టీ వసూలు కావడం ఇది రెండోసారి. జీఎస్టీ వసూళ్ల మొత్తంలో రూ.25,751 కోట్లు సీజీఎస్టీ కాగా.. రూ.32,807 కోట్లు ఎస్జీఎస్టీ, మరో రూ.79,518 కోట్లు ఐజీఎస్టీ వసూలైందని కేంద్రం ప్రకటించింది.
దేశంలో దిగుమతి చేసుకున్న వస్తువులపై రూ.41,420 కోట్ల పన్ను వసూలైందని, అలాగే రూ.10,920 కోట్లు సెస్ రూపంలో వచ్చాయని ఆర్థికశాఖ పేర్కొంది. జీఎస్టీ రికవరీకి సంబంధించిన గణాంకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇంతకుముందు జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.44 లక్షల కోట్లు. వరుసగా ఐదు నెలల జీఎస్టీ వసూళ్ల మొత్తం రూ.1.4 లక్షలకు పైగానే ఉండడం గమనించాల్సిన విషయం. ట్యాక్స్ చెల్లింపుదారులు సకాలంలో రిటర్న్లు సమర్పించేలా అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలించాయని ఆర్థికశాఖ పేర్కొంది.