న్యూఢిల్లీ, నవంబర్ 1: జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. జీఎస్టీ రేట్లను తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం భారీగా పుంజుకున్నాయి. అక్టోబర్ నెలకుగాను రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే 4.6 శాతం పెరిగాయని తెలిపింది. కానీ, ప్రస్తుత సంవత్సరంలో ఇంత కనిష్ఠ స్థాయి వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. సరాసరిగా ఈ ఏడాది 9 శాతం వృద్ధి నమోదైంది. సామాన్యుడికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ సర్కార్ 375 ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చేలా తీసుకున్న నిర్ణయంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ధరలు భారీగా తగ్గాయి.
గత నెలలో వసూలైనదాంట్లో దేశీయంగా వసూలైనవి రూ.1.45 లక్షల కోట్లు కాగా, దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన పన్నుతో రూ.50,884 కోట్లు సమకూరాయి. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు 6.5 శాతం పెరిగి రూ.1.86 లక్షల కోట్లకు చేరుకోగా, సెప్టెంబర్లో 9.1 శాతం ఎగబాకి రూ.1.89 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. పండుగ సీజన్ కావడం వల్లనే జీఎస్టీ వసూళ్లు ఈ మాత్రమైన నమోదయ్యాయి. సెప్టెంబర్ 22 నుంచి భారీ జీఎస్టీ రేట్ల కోతలు అమలులోకి వచ్చినప్పటికీ పన్ను వసూళ్లు మాత్రం స్వల్పంగా పెరిగాయని, ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతుందని ఆశిస్తున్నట్టు ప్రైస్ వాటర్హౌజ్ అండ్ కో ఎల్ఎల్పీ పార్టనర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
పలు రాష్ర్టాల్లో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, హార్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది. ఆయా రాష్ర్టాల్లో తయారీరంగం, సర్వీసెస్, పండుగ సీజన్ కూడా తోడవడం కలిసొచ్చిందని జలాన్ చెప్పారు. ముఖ్యంగా వాహన ధరలు భారీగా పడిపోవడం, పండుగ సీజన్ కూడా కావడంతో ఎగబడి కొనుగోళ్లు జరిపారు. అలాగే ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ విభాగాలు అంచనాలకుమించి రాణించినట్టు చెప్పారు.