GST | న్యూఢిల్లీ, నవంబర్ 1: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల అక్టోబర్లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లకుపైగా వచ్చాయి. జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి ఇంతలా కలెక్షన్స్ ఉండటం ఇది రెండోసారే కావడం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.10 లక్షల కోట్లు వసూలైంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎక్కువగా ఉన్నాయి. శుక్రవారం విడుదలైన ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈసారి జీఎస్టీ వసూళ్లు రూ.1,87,346 కోట్లుగా ఉన్నాయి. నిరుడు అక్టోబర్లో రూ.1.72 లక్షల కోట్లే. 8.9 శాతం వృద్ధి కనిపించింది.
ఈసారి సెంట్రల్ జీఎస్టీ కలెక్షన్ రూ.33,821 కోట్లుగా ఉంటే.. స్టేట్ జీఎస్టీ రూ.41,864 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.99,111 కోట్లుగా ఉన్నాయి. సెస్సు రూ.12,550 కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ 10.6 శాతం పెరిగి రూ.1.42 లక్షల కోట్లకు చేరింది. దిగుమతులపై విధించిన పన్ను ద్వారా రూ.45,096 కోట్లు సమకూరింది. గతంతో చూస్తే దాదాపు 4 శాతం పెరిగింది. పండుగల దృష్ట్యా మార్కెట్లో పెరిగిన కార్యకలాపాలు, అమ్మకాలు జీఎస్టీ వసూళ్లకు కలిసొచ్చాయి.