Groww Gets Satya Nadella | టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రోవ్ ( Groww )లో ఇన్వెస్టర్ కం సలహాదారుగా చేరారు. ఈ సంగతిని గ్రోవ్ వ్యవస్థాపకుడు లలిత్ కేశ్రీ వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ సీఈవోను ఇన్వెస్టర్‌గా, సలహాదారుగా గ్రోవ్ పొందింది. భారత్‌లో ఫైనాన్సియల్ సర్వీసెస్ అందుబాటులోకి తేవాలన్న తమ మిషన్‌లో సత్యనాదెళ్ల చేరినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు.
గతేడాది ఏప్రిల్‌లో గ్రోవ్ 83 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు టైగర్ గ్లోబల్ నుంచి సేకరించి యూనికార్న్ క్లబ్‌గా అవతరించింది. తర్వాత మరో ఆరు నెలల్లో న్యూ రౌండ్ ఫండింగ్‌లో 251 మిలియన్ డాలర్లు సేకరించడంతో దాని పెట్టుబడి మూడింతలై 300 కోట్ల డాలర్లు (రూ.22,500 కోట్లు)గా నిలిచింది.
లీడింగ్ ఫిన్‌టెక్ యూనికార్న్ సంస్థలు రాజోర్ పే, పైన్ ల్యాబ్స్ సరసన గ్రోవ్ చేరింది. గతేడాది నిధులను సేకరించడంతో రాజోర్ పే మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.5 బిలియన్ డాలర్లు, పైన్ ల్యాబ్స్ ఎం-క్యాప్ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఫ్లిప్‌కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు లలిత్ కేశ్రీ, హరీశ్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సాల్‌లు గ్రోవ్ సంస్థను 2016లో స్థాపించారు. వెబ్, మొబైల్ నుంచి ఫైనాన్సియల్ ప్రొడక్ట్స్, సేవలను పొందడానికి గ్రోవ్ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి నిధులు సేకరించింది.