హైదరాబాద్, డిసెంబర్ 24: ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ మళ్లీ ఊపందుకుంటున్నది. దీంతో 10 కోట్ల (100 మిలియన్లు) చదరపు అడుగుల క్లబ్‌లోకి హైదరాబాద్ త్వరలోనే చేరవచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నగర కమర్షియల్ స్పేస్ దాదాపు 7.6 కోట్ల (76 మిలియన్లు) చదరపు అడుగులతో ఉన్నది. ఈ క్రమంలో 40కిపైగా ఐటీ పార్కుల నుంచి అదనపు స్పేస్ రాబోతున్నదంటున్నారు. 100 మిలియన్లు, ఆపై చదరపు అడుగుల క్లబ్లో దేశంలో బెంగళూరు (160 మిలియన్లు), ఎన్సీఆర్-ఢిల్లీ (110 మిలియన్లు), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (105 మిలియన్లు)లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటి సరసన హైదరాబాద్ కూడా చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ అంటున్నది.
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో..
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో పరుగులు పెడుతున్నది. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార, పారిశ్రామిక రంగాలను ఆకర్షిస్తూ.. తద్వారా పెట్టుబడులను పొందుతున్నది. ఇప్పటికే ఫార్మా సిటీపై తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇక సెమీ-కండక్టర్ పాలసీపై పనిచేస్తుండగా, డాటా సెంటర్లకూ హైదరాబాద్ అడ్డా అవుతున్న సంగతీ విదితమే. ఇప్పటికే దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో మూడు డాటా సెంటర్లను అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సైతం మూడు డాటా సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా, పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ఉప్పల్ పరిసరాల్లో.. మున్ముందు ఐటీ పార్కులు రాబోతుండటం రాష్ట్ర ప్రభుత్వ బహుళ ప్రయోజనాల వ్యూహ రచన, సమూల అభివృద్ధికి అద్దం పడుతున్నది.
‘తయారీతోపాటు లైఫ్ సైన్సెస్, ఇతర రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఐటీ, దాని అనుబంధ రంగాల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ కనిపిస్తున్నది. మరోవైపు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు రాబోతున్నాయి. దీన్నిబట్టి 2023 ఆఖరుకల్లా 100 మిలియన్ చదరపు అడుగులను హైదరాబాద్ కమర్షియల్ స్పేస్ తాకవచ్చనిపిస్తున్నది’
పెరగనున్న ఉద్యోగావకాశాలు
కమర్షియల్ స్పేస్‌లో హైదరాబాద్ 10 కోట్ల చదరపు అడుగుల క్లబ్‌లోకి చేరితే మరిన్ని ఉద్యోగావకాశాలు రానున్నాయి. ప్రస్తుతం ఇక్కడి ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో 6.5 లక్షల మంది పనిచేస్తున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థల్లోనూ 1.5 నుంచి 1.8 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇక బయోటెక్, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ భాగ్యనగరం దూసుకుపోతున్నది. ఇప్పటికైతే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలతో పోల్చితే ఈ రంగంలో ఉద్యోగులు తక్కువగానే ఉన్నప్పటికీ.. త్వరలోనే పుంజుకోవచ్చన్న అంచనాలున్నాయి.