న్యూఢిల్లీ, జూలై 1 : జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,73,813 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికమయ్యాయి. మే నెలలో వసూలైన రూ.2.01 లక్షల కోట్లతో పోలిస్తే భారీగా తగ్గాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.2.37 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యాయి.
దీంట్లోభాగంగా జూన్ నెలలో వసూలైన రూ.1.84 లక్షల కోట్లతో దేశీయ లావాదేవీలు 4.6 శాతం అధికమై రూ.1.38 లక్షల కోట్లు నమోదు కాగా, దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే జీఎస్టీ 11.4 శాతం ఎగబాకి రూ.45,690 కోట్లకు చేరుకున్నాయి. ఈ జీఎస్టీ వసూళ్లలో స్థూల సెంట్రల్ జీఎస్టీ కింద రూ.34,558 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.43,268 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద రూ.93,280 కోట్లు వసూలయ్యాయి. దీంతోపాటు సెస్ రూపంలో రూ.13,491 కోట్లు వసూలయ్యాయి. రిఫండ్ రూపంలో రూ.25,491 కోట్లు చెల్లించింది.