న్యూఢిల్లీ, మార్చి 22: ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (హెచ్ఏఎల్)లో 3.5 శాతం వాటాను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు బుధవారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు సమాచారం ఇచ్చింది. షేరుకు రూ.2,450 ఫ్లోర్ ధరతో 3.5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం విక్రయించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ విక్రయం ద్వారా కేంద్రానికి రూ.2,867 కోట్లు సమకూరుతుంది. బుధవారం స్టాక్ మార్కెట్లో హెచ్ఏఎల్ షేరు ముగింపు ధర రూ.2,625 పోలిస్తే ఫ్లోర్ ధరను డిస్కౌంట్లో నిర్ణయించారు. సెబీ లిస్టింగ్ నిబంధనల ప్రకారం పబ్లిక్ వాటాను కనీస స్థాయికి పెంచడం కోసం తాజాగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) చేపట్టినట్టు హెచ్ఏఎల్ తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీలో ప్రభుత్వానికి 75.15 శాతం వాటా ఉంది.
లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫర్ చేయాలని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అయితే ఈ నిబంధన నుంచి ప్రభుత్వ రంగ కంపెనీలకు మినహాయింపు ఉంది. అయినా సరే అధిక ధరకు ట్రేడవుతున్న హెచ్ఏఎల్ షేరును సొమ్ము చేసుకుని, డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని పూర్తిచేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరాటపడుతున్నట్టు తాజా హెచ్ఏఎల్ వాటా విక్రయం ధృవపరుస్తున్నది. ఈ నెలాఖరుతో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 50,000 కోట్లు సమీకరించే లక్ష్యాన్ని కేంద్ర బడ్జెట్లో నిర్దేశించుకోగా, ఇప్పటివరకూ రూ. 31,100 కోట్లు వచ్చాయి. అలాగే తాజాగా హిందుస్థాన్ జింక్ రూ.26 మేర భారీ డివిడెండును ప్రకటించడంతో, ఈ కంపెనీలో దాదాపు 30 శాతం వాటా కలిగిన కేంద్రానికి రూ.4,000 కోట్ల వరకూ సమకూరతాయి.
పలు డిఫెన్స్ ఆర్డర్ల కారణంగా ఇటీవలకాలంలో హెచ్ఏఎల్ షేరు ధర రికార్డుస్థాయికి ర్యాలీ జరిపింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 87,800 కోట్లు. ఎక్సేంజీలకు సమర్పించిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ఈ మార్చి 23, 24 తేదీల్లో 1.75 శాతం వాటా విక్రయిస్తుంది. ఆఫర్ ఓవర్ సబ్స్క్రయిబ్ అయితే అదనంగా మరో 1.75 శాతం వాటాను ప్రభుత్వం ఆఫ్‌లోడ్ చేస్తుంది. ఈ మొత్తం ఆఫర్లో 10 శాతం షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో భాగంగానే ఓఎఫ్ఎస్ ద్వారా 2020లో హెచ్ఏఎల్లో 15 శాతం వాటా విక్రయించి కేంద్రం రూ. 5,000 కోట్లు సమీకరించింది.