న్యూఢిల్లీ, డిసెంబర్ 2 : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీవోఎం) షేర్లకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించింది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)లో భాగంగా మంగళవారం ఉదయం నాన్-రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఒక్కో షేర్‌ను రూ.54 ధరతో 38,45,77,748 (దాదాపు 38.46 కోట్లు) షేర్లను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. అయితే తొలిరోజే ఏకంగా 407 శాతం (4.07 రెట్లు) అధికంగా సబ్‌స్ర్కైబ్ అయ్యింది. దీంతో బేస్ ఆఫర్‌కు అదనంగా మరింత వాటాను విక్రయానికి తీసుకురావాలని మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ క్రమంలోనే సుమారు మరో 8 కోట్ల షేర్లను సేల్కు జత చేశారు. వీటికి బుధవారం రిటైల్ ఇన్వెస్టర్లు బిడ్లను దాఖలు చేయవచ్చు. ఈ మేరకు దీపం కార్యదర్శి అరుణిష్ చావ్లా ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కాగా, తొలుత అమ్మకానికి పెట్టిన వాటా బ్యాంక్ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 5 శాతానికి సమానం.
దీనికి మరొక్క శాతం (7,69,15,549) షేర్లు కలిశాయిప్పుడు. దీంతో 6 శాతానికి సమానమైన 46.14 కోట్లకుపైగా షేర్లు ఈ ఓఎఫ్ఎస్ ద్వారా కేంద్రం అమ్మినైట్టెంది. తద్వారా దాదాపు రూ.2,492 కోట్లు ఖజానాకు చేరుతున్నాయి. ఇక సోమవారం బీఎస్ఈ ట్రేడింగ్‌లో బీవోఎం షేర్ రూ.57.66 వద్ద ముగిసింది. అయినప్పటికీ దీనిపై 6.34 శాతం రాయితీతో రూ.54 ఫ్లోర్ ప్రైస్‌కే బ్యాంక్ షేర్‌ను కేంద్రం అమ్మకానికి పెట్టింది. కాగా, పుణె కేంద్రంగా నడుస్తున్న బీవోఎంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం 79.60 శాతం వాటా ఉన్నది. అయితే ఈ విక్రయంతో సర్కారు వాటా 75 శాతం దిగువకు పడిపోతున్నది. తద్వారా క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంస్థల కోసం పెట్టిన మినిమం పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధన 25 శాతాన్ని బీవోఎం అందుకున్నట్టవుతున్నది.