Banks Privatisation | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాల ఉపసంహరణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నది. తాజాగా నాలుగు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మైనారిటీ వాటాను విక్రయించేందుకు కేంద్ర ఆర్థికశాఖ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ నిబంధనలకు అనుగుణంగా వాటాల ఉపసంహరణకు రంగం సిద్ధమైంది. త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank), యూకో బ్యాంక్ (UCO Bank), పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు (Punjab and Sind Bank) ల్లో వాటాల ఉపసంహరణకు ఆర్థిక శాఖ ఆమోదం పొందుతుందని అని రాయిటర్స్ ఓ వార్తా కథనం ప్రచురించింది.
గత సెప్టెంబర్ నెల నాటికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93 శాతానికి పైగా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 96.4 శాతం, యుకో బ్యాంకులో 95.4, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో 98.3 శాతం వాటాలు కలిగి ఉంది కేంద్రం. ఓపెన్ మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాల విక్రయం పరిశీలనలో ఉందని అధికార వర్గాల సమాచారం. వాటాల విక్రయం వార్తల నేపథ్యంలో బ్యాంకుల షేర్లు మూడు నుంచి నాలుగు శాతం మధ్య పెరిగాయి.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధన ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో 25 శాతం పబ్లిక్ షేర్ తప్పనిసరిగా ఉండాలి. ఇక ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిబంధన నుంచి 2026 ఆగస్టు వరకూ మినహాయింపు ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం వాటాను 75 శాతం కంటే తగ్గుతుందని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా స్పందించడానికి సదరు బ్యాంకు అధికారులు నిరాకరించారు. ఇక కేంద్ర ఆర్థిక శాఖ కూడా వెంటనే స్పందించడానికి నిరాకరించింది.