RBI | న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రిజర్వుబ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వర్ రావు పదవీకాలాన్ని ఏడాది పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ది అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్(ఏసీసీ) సమావేశమై రాజేశ్వర్ పదవీకాలాన్ని అక్టోబర్ 9, 2024 నుంచి మరో ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగేందుకు అనుమతినిచ్చింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా అక్టోబర్ 2020లో మూడేండ్ల కాలపరిమితితో నియమితులయ్యారు. ఇప్పటికే ఆయన పదవీకాలాన్ని రెండు సార్లు పొడిగించారు. 1984లో సెంట్రల్ బ్యాంక్‌లో చేరారు.
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా డాక్టర్ అవిరల్ జైన్ నియమితులయ్యారు. ఈడీగా పదోన్నతి పొందడానికి ముందు జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్‌గా సేవలందించారు. అవిరల్ జైన్‌కు కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకం నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ వంటి విభాగాల్లో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది.