Navratna | న్యూఢిల్లీ, మార్చి 3: ప్రభుత్వరంగ సంస్థలైన ఐఆర్సీటీసీ, ఐఆర్ఎఫ్సీలకు నవరత్న హోదాను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో నవరత్న హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కి చేరుకున్నాయి. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం నవరత్న హోదాను ఇస్తున్నది. దీంట్లోభాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను ఐఆర్సీటీసీ రూ.4,270 కోట్ల వార్షిక ఆదాయాన్ని, ఐఆర్ఎఫ్సీ రూ.26, 644 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ఈ రెండు సంస్థలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుభాకాంక్షలు తెలియచేశారు. నవరత్న హోదా కలిగిన పీఎస్యూలు పెట్టుబడులు, నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కంపెనీ నికర విలువలో 15 శాతం లేదా రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.