న్యూఢిల్లీ, మే 14: దేశంలోకి వచ్చే బంగారం, వెండి దిగుమతులపై బుధవారం సుంకాలను భారీగా పెంచిన మోదీ సర్కార్.. గురువారం దిగుమతులపైనా పరిమితుల్ని తీసుకొచ్చింది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులు 100 కిలోలు మించరాదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఓ బహిరంగ ప్రకటనలో తెలిపింది. ఈ పథకంలో జ్యుయెల్లరీ ఎగుమతిదారులు నగల తయారీకి అవసరమైన ముడి సరుకుగా బంగారాన్ని ఎటువంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. అయితే ఇంతకుముందు ఎంతైనా దిగుమతి చేసుకొనే వీలుండేది. కానీ ఇకపై ఒక లైసెన్స్‌కు 100 కిలోలకు మించి ఒకేసారి దిగుమతి చేసుకోరాదు. అలాగే సదరు లైసెన్స్ కలిగిన ఎగుమతిదారు మళ్లీ పుత్తడిని దిగుమతి చేసుకోవాలంటే అంతకుముందు దిగుమతైన బంగారంలో కనీసం 50 శాతాన్ని (గరిష్ఠంగా 50 కిలోలు) ఎగుమతి చేసైనా లేదా ఎగుమతికి సిద్ధం చేసైనా ఉండాలన్న నిబంధనను డీజీఎఫ్టీ ఇప్పుడు పెట్టింది.
ఇక కొత్తగా బంగారాన్ని దిగుమతి చేసుకోవాలనుకునే జ్యుయెల్లర్ ఎగుమతిదారు.. సంబంధిత అధికారులకు వారి నగల తయారీ కేంద్రాన్ని చూపించాల్సి ఉంటుందని, అన్నీ పరిశీలించిన తర్వాతనే నిబంధనలకు లోబడి లైసెన్స్‌ను మంజూరు చేస్తామని డీజీఎఫ్టీ ఈ సందర్భంగా పేర్కొన్నది. కాగా, ఎగుమతయ్యే ఉత్పత్తి తయారీలో వినియోగించే ఉత్ప్రేరకాలు, ప్యాకేజింగ్ సామగ్రి, ఇంధనం, చమురు వంటి దిగుమతులనూ ఈ స్కీమ్‌లోనే అనుమతిస్తారు. ఇక నగల ఎగుమతిదారులు 15 రోజులకోసారి తమ ఉత్పాదక కార్యకలాపాల నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. ఇందులోని పసిడి దిగుమతి, ఎగుమతుల వివరాలను స్వతంత్ర చార్టెడ్ అకౌంటెంట్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ నెలకోసారి సంబంధిత అధికారులు డీజీఎఫ్టీకి సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
బంగారం ధరలు మరింత పెరిగాయి. న్యూఢిల్లీలో పదిగ్రాముల పుత్తడి రూ.1.66 లక్షలకు చేరుకున్నది. రూపా యి పతనం చెందడం, అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొనడంతో అతి విలువైన లోహాలు ఎగువముఖం పడుతున్నాయి. దీంట్లోభాగంగా 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర రూ.650 అందుకొని రూ.1,66,000కి చేరుకున్నట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. మరోవైపు, గత మూడు రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు దిగువముఖం పట్టాయి. కిలో వెండి రూ.900 తగ్గి రూ.2,96,600కి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,704.30 డాలర్లకు చేరుకోగా, వెండి 87.04 డాలర్ల దిగువకు పడిపోయింది.