Russia-Ukrain Conflict |ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్కసారిగా పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల మార్క్‌ను దాటేసింది. బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్ల మార్క్‌ను దాటడం దాదాపు ఎనిమిదేండ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగంపై ప్రస్తుతం వసూలవుతున్న ఎక్సైజ్ సుంకం ఎంత అన్న అంశాన్ని గణించాలని ఆర్థికశాఖను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) కోరినట్లు సమాచారం. పెరిగిన ధరలను ఎక్సైజ్ సుంకంలో కలిపేయడానికి గల అవకాశాలను ఆర్థికశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌తోపాటు బంగారం, ఇతర వస్తువుల దిగుమతిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందన్న విషయమై ఆర్థికశాఖ అధికారులతో ప్రధాని మోదీ గురువారం భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆ శాఖ సీనియర్ అధికారులు కూడా పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే దేశీయంగా గతేడాది నవంబర్ నాలుగో తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. అదే రోజు డీజిల్‌పై రూ.10, పెట్రోల్‌పై రూ.5 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. నాటి నుంచి ఇప్పటివరకు కేంద్ర చమురు సంస్థలు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచలేదు.