న్యూఢిల్లీ, జూన్ 8 : ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె హెచ్చరికను జారీచేశారు. తమ పెన్షన్, వారానికి ఐదు రోజుల పని డిమాండ్లకు సంబంధించి జూన్ 27న సమ్మె చేయనున్నట్టు తొమ్మిది బ్యాంక్ యూనియన్ల సమాఖ్య యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్‌బీయూ) తెలిపింది.
నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను ఎత్తివేసి, పాత పెన్షన్ స్కీమ్‌ను పునర్ప్రవేశపెట్టడం, పెన్షనర్లందరి పెన్షన్ల అప్డేషన్, రివిజన్ తమ ప్రధాన డిమాండ్లని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం చెప్పారు. దేశవ్యాప్తంగా ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా తెలిపారు.