న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ ఏడాది జనవరిలో గూగుల్ (Google) సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించగా అందుకు అనుగుణంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది. భారత్‌కు చెందిన గూగుల్ ఉద్యోగులకూ టెర్మినేషన్ లెటర్స్ పంపడం ప్రారంభమైందని సమాచారం. భారత్‌లోని వివిధ విభాగాల్లో పనిచేసే 450 మంది ఉద్యోగులను గూగుల్ సాగనంపుతోందని ఓ రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్‌కు ఇండియాలో గురుగ్రాం, హైదరాబాద్, బెంగళూర్‌ల్లో ప్రధాన కార్యాలయాలున్నాయి.
గూగుల్ నుంచి తమను అర్ధంతరంగా తొలగించారని పలువురు ఉద్యోగులు లింక్డిన్లో పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ ఇండియాలో ఇటీవల చేపట్టిన లేఆఫ్స్‌లో అధిక నైపుణ్యాలు కలిగిన టాలెంటెడ్ కొలీగ్స్ కొలువులు కోల్పోయినట్టు తెలిసిందని గూగుల్ ఇండియా ఉద్యోగి రజనీష్‌కుమార్ ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు. గూగుల్ ఇండియా లేఆఫ్స్‌లో తాను బాధితుడినయ్యానని గూగుల్ ఇండియాలో అకౌంట్ మేనేజర్ కమల్ దవే లింక్డిన్ పోస్ట్‌లో రాసుకొచ్చారు. సింగపూర్, ఇండియాలో గతరాత్రి లేఆఫ్స్‌లో భాగంగా తన బ్రిలియంట్ కొలీగ్స్, ఫ్రెండ్స్‌ను మిస్ అయ్యానని సింగపూర్ కార్యాలయానికి చెందిన సప్తక్ మహంత పేర్కొన్నారు.
మహంత గూగుల్‌లో ప్రోగ్రాం మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో భారత్, సింగపూర్ నుంచి పలువురు బాధిత ఉద్యోగు నుంచి మరిన్ని పోస్ట్‌లు వెలుగుచూస్తాయని భావిస్తున్నారు. కాగా అమెరికాలో బాధిత ఉద్యోగులకు ఇప్పటికే ఈమెయిల్స్ పంపామని ఇతర దేశాల్లో స్ధానిక చట్టాలు, నిబంధనలను అనుసరించి ఈ ప్రక్రియలో కొంత జాప్యం వాటిల్లుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారని సమాచారం. ఈ నిర్ణయాలన్నింటికీ తాను బాధ్యత వహిస్తానని పిచాయ్ ఈ సందర్భంగా ఉద్యోగులకు స్పష్టం చేశారు.