Google LayOffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగాల కోత కొనసాగుతున్నది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్ వార్, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగం పెరగడం.. వెరసి కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను (Employees) తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ (Google) ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు (LayOffs) ప్రకటించింది.
సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌లో (Global Business Unit) 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. కంపెనీలో పునర్వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక నెల రోజుల వ్యవధిలోనే గూగుల్ తన ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
గత నెల 11వ తేదీన కూడా ప్లాట్‌ఫామ్, డివైజ్ యూనిట్లలో పనిచేసే వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్, పిక్సెల్ ఫోన్లు, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై ఈ వేటు పడింది. ఇక గతేడాది అంటే 2024 డిసెంబర్లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో 12 వేల మంది ఉద్యోగులను గూగుల్ తొలగించింది.
ఇటీవలి కాలంలో చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని కంపెనీలు పలు కారణాలు చూపుతూ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగించాయి. లేఆఫ్స్.ఎఫ్వై వెబ్సైట్ వివరాల ప్రకారం, 2025లో సాంకేతిక రంగంలో 100 కంపెనీలు 27,762 మంది ఉద్యోగులను తొలగించాయి. అంతకుముందు ఏడాది టెక్ రంగంలో 549 కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి. 2023లో 1,193 కంపెనీలు 2,64,220 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
Also Read..
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి