Gold Price | సుబ్రహ్మణ్యం కూతురు పెండ్లి ఖాయమైంది. అమ్మాయికి నగానట్రా కొనాలనుకున్నారు. కానీ పెరుగుతున్న ధరల్ని చూసి బెంబేలెత్తిపోతున్నారు.
ధనుష్ తన పిల్లల కోసం ఎంతోకొంత బంగారాన్ని కూడబెట్టాలనుకుంటున్నాడు. అయితే పరుగులు పెడుతున్న రేట్లతో సందిగ్ధంలో పడిపోయాడు.
స్వాతి తన సంపాదనతో ఓ నెక్లెస్ కొనాలనుకున్నది. మార్కెట్ పోకడను చూసి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి మనలో చాలామందిది ఇప్పుడిదే పరిస్థితి. అసలు బంగారం దారెటు? ధరలు పైకా, కిందికా? పెట్టుబడులు పెడితే కరెక్షన్ వస్తుందేమో? అన్న సందేహాలు మదిని తొలిచేస్తున్నాయి మరి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డు స్థాయికి చేరుతూ ఆల్‌టైమ్ హైల్లోనే కదలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒక్కరోజే దేశంలోని ప్రధాన నగరాల్లో తులం వెయ్యి రూపాయలకుపైగా ఎగబాకింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఢిల్లీ మార్కెట్ మూతబడగా.. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం 10 గ్రాముల మేలిమి బంగారం విలువ ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి రూ.87,000లను తాకడం గమనార్హం. పెండ్లిళ్ల సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో ఇంకా పెరగవచ్చన్న సంకేతాలున్నాయి.
ఏడాది ఆఖర్లో లక్షకు?
రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయంటున్న మార్కెట్ నిపుణులు.. ఈ ఏడాది చివర్లో దేశీయంగా తులం లక్ష రూపాయలను తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్తుండటం గమనార్హం. ఇక త్వరలో విడుదలయ్యే అమెరికా ఆర్థిక గణాంకాలతో ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయని పేర్కొంటున్నారు. ఇందులోభాగంగానే ఔన్స్ 3,000లకు వెళ్లే వీలుందంటున్నారు. ఇప్పటికే తొలిసారి 2,830 డాలర్లను అధిగమించింది. అయితే 2-3 నెలల్లో ధరలు తగ్గుముఖం పట్టవచ్చనీ చెప్తున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం పెరుగుతూపోతాయని, ఈ క్రమంలోనే అక్టోబర్-డిసెంబర్లో భారతీయ విపణిలో రూ.95,000-1,00,000 మార్కును చేరడం ఖాయమనే అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ ఏడాది ధరల స్థిరీకరణకు అవకాశాలు తక్కువేనన్న మాట మెజారిటీ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్నది.
పెట్టుబడులు పెడుతారా?
దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరుగుతూపోతున్న నేపథ్యంలో పెట్టుబడులపై కూడా సగటు మదుపరి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆభరణాల రూపంలో పుత్తడి కొంటే తరుగు, తయారీ చార్జీలతోపాటు నిల్వ చేసుకోవడం కూడా సమస్యగా మారుతున్నదని చెప్పక తప్పదు. దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్లు ఉత్తమమని ఇన్వెస్టర్లకు మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుత ట్రెండ్ దృష్ట్యా పెద్ద మొత్తంలో ఈ పెట్టుబడులు ఉండకుండా జాగ్రత్త తీసుకోవడం కూడా ముఖ్యమేనని హితవు పలుకుతున్నారు. కానీ నిర్ణయం తీసుకునే ముందు అంతర్జాతీయ పరిణామాలను గమనించడం లాభదాయకమని సలహా ఇస్తున్నారు.
Gold
హైదరాబాద్‌లో తులం 87,000
హైదరాబాద్ రిటైల్ మార్కెట్లో పసిడి ధరలు మునుపెన్నడూ లేనివిధంగా నమోదయ్యాయి. బుధవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల ధర ఆల్‌టైమ్ హైని తాకుతూ ఏకంగా రూ.87,000 పలికింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం రేటు సైతం రూ.78,900గా ఉన్నది. ఈ ఒక్కరోజే రూ.1,000 పుంజుకోవడం గమనార్హం. మంగళవారం కూడా పుత్తడి ధరల్లో భారీ పెరుగుదలే కనిపించింది. దీంతో రెండు రోజుల్లోనే రూ.2వేలకుపైగా బంగారం రేటు ఎగిసినైట్టెంది. మరోవైపు కిలో వెండి విలువ రూ.98,000గా ఉన్నట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఒక్కరోజే రూ.1,000 పుంజుకున్నది.
ద్రవ్యోల్బణం
అమెరికాలోని ట్రంప్ సర్కారు చైనాపై 10 శాతం సుంకాలను విధించడం, కెనడా-మెక్సికోలపై 25 శాతం చొప్పున ప్రతిపాదించడం.. గ్లోబల్ మార్కెట్లో ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నది. దీంతో మదుపరులు ఆ ప్రభావాన్ని తట్టుకొనేందుకు బంగారాన్ని రక్షణగా ఎంచుకుంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలను కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను పెంచే అవకాశాలూ కనిపిస్తున్నాయి. ఈ అంచనా కూడా గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నది.
సురక్షిత పెట్టుబడి సాధనం
స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఒడిదొడుకుల నడుమ ఇన్వెస్టర్లు.. బంగారంపై మరింత ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు సైతం గోల్డ్‌ను సురక్షిత పెట్టుబడి సాధనంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా సహజంగానే డిమాండ్ పెరిగి రేట్లు పైపైకి వెళ్తున్నాయి.
సెంట్రల్ బ్యాంక్‌ల పసిడి కొనుగోళ్లు
బంగారాన్ని ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి. అమెరికాతో వాణిజ్య యుద్ధం సంకేతాల మధ్య చైనా తమ పసిడి నిల్వలను ఇంకా పెంచుకుంటూపోతున్నది. ఇది కూడా ధరల పెరుగుదలకు దారితీస్తున్నది.
డాలర్ ఇండెక్స్ కదలికలు
అమెరికా డాలర్ ఇండెక్స్ ఇటీవలే 109 మార్కును దాటేసింది. దీని ప్రభావం బంగారంసహా అన్ని కమోడిటీ మార్కెట్లపై పడుతున్నది. మరోవైపు అంతర్జాతీయ మదుపరులు కూడా ఈక్విటీ, బాండ్ మార్కెట్లు క్రాష్ అవుతాయన్న భయాలతో గోల్డ్ వైపే చూస్తున్నారు.
వాణిజ్య యుద్ధం భయాలు
అమెరికా తమపై విధించిన సుంకాలకు బదులుగా చైనా కూడా అగ్రరాజ్యం నుంచి వచ్చే దిగుమతులపై సుంకాలు వేసింది. ఈ ప్రతీకార సుంకాలు.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధానికి దారితీయవచ్చన్న ఆందోళనల్ని కలిగిస్తున్నది. ఫలితంగా పెట్టుబడులన్నా బంగారం వైపు క్యూ కడుతున్నాయి.
భారతీయ గోల్డ్ డిమాండ్ 803 టన్నులు
గత ఏడాది దేశంలో గోల్డ్ డిమాండ్ 802.8 టన్నులుగా ఉన్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) బుధవారం తెలియజేసింది. 2023తో పోల్చితే ఇది 5 శాతం పెరిగినట్టు పేర్కొన్నది. నాడు 761 టన్నులుగా నమోదైంది. కాగా, విలువపరంగా చూసినైట్టెతే ఈ డిమాండ్ 2023లో రూ.3,92,000 కోట్లుగా ఉంటే.. 2024లో రూ.5,15,390 కోట్లకు పెరిగింది. ఇక ఈ ఏడాది డిమాండ్ 700-800 టన్నుల మేర ఉండొచ్చని కూడా తాజా రిపోర్టులో డబ్ల్యూజీసీ ఇండియా విభాగం ప్రాంతీయ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. ప్రపంచ డిమాండ్ 4,974 టన్నులుగా ఉన్నది. సెంట్రల్ బ్యాంకులు 1044.6 టన్నుల బంగారం కొన్నాయి.