Gold Rates | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. పది గ్రాముల బంగారం రూ.1000 పెరిగి తులానికి రూ.1,00,750కి చేరింది. మంగళవారం వరకు ధర రూ.99,750 వద్ద కొనసాగింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించి బంగారాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడంతో ధరలు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ప్రస్తుతం ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరో వైపు 99.5 ప్యూరిటీ గోల్డ్ రూ.1050 పెరిగి తులానికి రూ.1,00,350కి చేరింది. బంగారం ధర మరోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరువైంది. ఇంతకు ఏప్రిల్ 22న తులం బంగారం రూ.1,06,600 పలికిన విషయం తెలిసిందే. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ప్రపంచవ్యాప్తంగా స్పాట్ బంగారం బుధవారం 1.8శాతం తగ్గి ఔన్సుకు 3,369.65కి చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చల అంచనాల నేపథ్యంలో కొంత ఉపశమనం కలుగగా.. బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అయితే, ఇండో-పాక్ ఉద్రిక్తతలు ఉన్నా బంగారం డిమాండ్ భారత్‌లో భాగానే ఉన్నది. కొన్నిచోట్ల ఉద్రిక్తతలు తగ్గుతున్నా.. ఇండో-పాక్ సరిహద్దు, మధ్యపాచ్యం, ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పెట్టుబడికి బంగారంపైనే ఆసక్తి చూపుతున్నారని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవ చింతన్ మెహతా తెలిపారు. మార్కెట్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుందని కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏపీవీ కయంత్ చైన్వాలా పేర్కొన్నారు. ఈ సారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయబోదని ఆశిస్తున్నారు. అలాగే, పెట్టుబడిదారులను ఉద్దేశించి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావల్ ప్రకటన చేయనుండగా.. ఆయన ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది.