Gold Prices | న్యూఢిల్లీ, ఆగస్టు 6: బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీలో 24 క్యారెట్ 10 గ్రాముల రేటు రూ.1,100 దిగి రూ.71,700 వద్ద నిలిచింది. నగల వర్తకులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం వల్లే రేట్లు తగ్గినట్టు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆభరణాల పుత్తడి రేట్లూ దిగువముఖం పట్టాయి. 22 క్యారెట్ తులం విలువ రూ.71,350గా నమోదైంది. క్రితంతో చూస్తే రూ.1,100 దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.72,450గా ఉన్నది. ఇదిలావుంటే హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ. 71,500గా ఉన్నాయి.
బంగారం ధరలకుతోడు వెండి రేట్లూ తగ్గుతున్నాయి. మంగళవారం కిలో ధర రూ.2,200 దిగింది. రూ.82,000గా ఉన్నది. అయితే గత నాలుగు రోజుల్లో రేట్లు రూ.4,200 తగ్గినట్టు అఖిల భారత సరఫ సంఘం చెప్తున్నది. రిటైల్ కస్టమర్లతోపాటు ఇండస్ట్రీ వర్గాల నుంచి వెండికి ఆదరణ తగ్గిందని ట్రేడర్లు అంటున్నారు. అందుకే ధరలు క్రమేణా దిగివస్తున్నాయని పేర్కొంటున్నారు.
గ్లోబల్ మార్కెట్లోనూ రేట్లు పడిపోయాయి. ఈ ఒక్కరోజే ఔన్సు గోల్డ్ ధర ఏకంగా 20 డాలర్లు తగ్గడం గమనార్హం. దీంతో 2,409 డాలర్లుగా ఉన్నది. వెండి ధర 26.94 డాలర్లుగా ఉన్నది. ఫ్యూచర్ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకులతోనే ధరలు తగ్గుతున్నాయని ట్రేడింగ్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ధరలు.. భారతీయ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నాయి.
స్టాక్ మార్కెట్లు గత మూడు రోజులుగా నష్టాలకే పరిమితమవుతున్నాయి. ప్రతికూల పరిణామాలు ఇందుకు కారణంగా నిలుస్తుండగా.. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకు దిగుతున్నారు.